మార్నింగ్ వాక్ ఎలా చేస్తున్నారు?

మంగళవారం, 5 డిశెంబరు 2017 (09:43 IST)
మనిషికి శారీరక శ్రమ చాలా అవసరం. అది లేకపోతే రోగాల బారిన పడటం ఖాయం. దైనందిన చర్యల్లో దీన్ని తప్పనిసరి చేసుకోవాలి. అన్నింటికన్నా ఉత్తమమైన శారీరక శ్రమ వ్యాయామమే. ఇందులో ప్రధానమైనది మార్నింగ్‌ వాక్‌. నడకతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి మార్నింగ్ వాక్‌ను ఎలా చేయాలో వ్యాయామ నిపుణులు చెపుతున్నారు. 
 
ప్రతీరోజూ ఉదయాన్నే నడవడం వల్ల ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు. తెల్లవారుజామున వీచే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ వాకింగ్ చేయడం వలన శరీరానికి సమృద్ధిగా ఆక్సిజన్ అందుతుంది. అయితే, మార్నింగ్‌వాక్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. 
 
ప్రశాంతమైన, పచ్చనిచెట్లు ఉన్న ప్రాంతాన్ని మార్నింగ్‌వాక్‌కు ఎంచుకోవాలి. మార్నింగ్‌వాక్‌కు వెళ్లేముందు ఒక గ్లాసు మంచినీటిని తప్పక తాగాలి. హృదయ సంబంధిత వ్యాధులు, హై బీపీ ఉన్న వారు మార్నింగ్‌వాక్ చేయాలనుకుంటే, ముందుగా వైద్యుని సలహా తీసుకోవాల్సి ఉంటుంది. 
 
ఎవరికితగ్గట్టు వారు తమ వయసును అనుసరించి వాకింగ్ చేయాలి. వాకింగ్‌చేసే సమయంలో పాదాలకు సౌఖ్యాన్ని అందించే చెప్పులు, లేదా షూస్ ధరించాలి. మంచి ఆరోగ్యం కోసం అరగంట పాటు వాకింగ్ చేయడం మంచిది. వారంలో ఏడు రోజులూ వాకింగ్ చేయలేనివారు కనీసం నాలుగు రోజులైనా చేయడం ఎంతో ఆరోగ్యకరమైన విషయమని వైద్యులు సలహా ఇస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు