కరక్కాయ ముక్కలను తేనెతో కలిపి తీసుకుంటే?

సోమవారం, 4 అక్టోబరు 2021 (22:34 IST)
కరక్కాయ ముక్కలను నీళ్లలో నానపెట్టి, ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. వాంతులవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచినీళ్లలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. వాతాన్ని వారిస్తుంది. కరక్కాయను అరగదీసి ఆ గంధాన్ని నుదుటన పట్టిస్తే తలనొప్పి కళ్లు మంటలు తగ్గుతాయి. కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పండ్లు తోముకుంటే చిగుళ్లు గట్టిపడి పంటి వ్యాధులు రావు.
 
పిప్పిపన్ను పోటు తగ్గుతుంది. కరక్కాయ పెచ్చులను పసుపు దుంపల రసంతో సహా లోహ ఖల్వంలో నూరి గోరుచుట్ట మీద తరచూ ప్రయోగిస్తూ ఉంటే గోరుచుట్ట పగిలి ఉపశమనం లభిస్తుంది. భోజనానికి అరగంట ముందు కరక్కాయ చూర్ణానికి కొంచెం బెల్లం కలిపి అరచెంచాడు మోతాదుగా రెండు పూటలా తీసుకుంటుంటే రక్తమొలలు తగ్గిపోతాయి. 
 
కరక్కాయ చూర్ణాన్ని అరచెంచాడు చొప్పున రెండు పూటలా ఆముదంతో కలిపి ప్రతి నిత్యం తీసుకుంటే కీళ్లనొప్పిలో ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ చూర్ణం రెండు భాగాలకు వేయించిన పిప్పళ్ల చూర్ణం ఒక భాగం కలిపి, మోతాదుకు పావు చెంచాడు చూర్ణం (1 గ్రాము), తేనెతో కలిపి ప్రతి 4 గంటలకూ ఒకసారి చొప్పున నాకిస్తూ ఉంటే కోరింత దగ్గు తగ్గిపోతుంది. 
 
కరక్కాయ చూర్ణాన్ని మోతాదుకు 3 గ్రాములు, తేనెతో కలిపి ప్రతిరోజూ రెండు పూటలా ఇస్తూ నూనెలూ, కారం, పులుపు, మసాలాలు వంటివి తగ్గించి చప్పిడి పథ్యం చేయిస్తే ఒకటి రెండు వారాల్లో కామెర్లు తగ్గుతాయి. కరక్కాయ పెచ్చులనూ, మామిడిజీడిలోని పలుకులనూ సమభాగాలు గ్రహించి పాలతో సహా నూరి, తలకు ప్రయోగిస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఫలితం కనిపిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు