అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని దాచి తనకు పెళ్లి చేసిన భార్యను ఓ భర్త కడతేర్చాడు. ఈ కేసులో భర్తతో పాటు భార్య కూడా వైద్యులు కావడం గమనార్హం. అయితే, ఈ హత్య ఆరు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు భర్తను అరెస్టు చేసి జైలుకు పంపించారు. బెంగుళూరులో జరిగిన ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే,
విక్టోరియా ఆసుపత్రిలో డెర్మటాలజిస్ట్‌గా పనిచేసే డాక్టర్ కృతికా రెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డిలకు 2024 మే 26న వివాహం జరిగింది. ఆమెకు అజీర్ణం, లోషుగర్, గ్యాస్ట్రిక్ తదితర సమస్యలు ఉన్న విషయాన్ని వరుడి దగ్గర దాచి ఈ వివాహం చేశారు. వివాహమైన కొద్ది రోజులకే ఈ విషయాన్ని గుర్తించిన మహేంద్ర రెడ్డి.. భార్యతో కలిసి అత్తగారింటికి వచ్చేశాడు.
చికిత్స నెపంతో ఆమెకు అనస్తీషియా డోసులు ఇస్తూ వచ్చాడు. ఈ ఏడాది ఏప్రిల్ 23న కృతిక హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయిందని నిందితుడు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. అనారోగ్య సమస్యలతో ఆమె మరణించిందని భావించి, పోస్టుమార్టం నిర్వహించారు.
అయితే, శరీరంలో అనస్తీషియా ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు. అందులోనూ అదే విషయం నిర్ధారణ కావడంతో మారతహళ్లి ఠాణా పోలీసులు బుధవారం మహేంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనస్తీషియా ఓవర్ డోస్ ఇచ్చి హత్య చేసినట్లు విచారణలో ఆయన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.