అరటి పలు రకాలుగా వుంటుంది. మనకు తెలసినవి కూర అరటి, చక్కెరకేళి, అమృతపాణి మాముల అరటి, పచ్చఅరటి పండు ఇలా అనేక రకాలు ఉంటాయి. దీనిలో చాల ఔషధ గుణాలు ఉన్నాయి. దీని ఔషధ గుణాలు గుర్తించి కాబోలు నాటి పెద్దలు తాంబూలాన్ని దేవునికి సమర్పించేటప్పుడు తప్పనిసరిగా అరటిపళ్ళను తమలపాకులలో వుంచుతారు. అరటిపండు లేనిదే పూజా కార్యక్రమం పూర్తికాదు. అరటి చెట్టు తెలుగువారి దైనందిన జీవితంలో ఒక భాగం అంటే అతిశయోక్తికాదు.
అరటి పువ్వును కూరల్లో వాడటం ఇక్కడ విశిష్టత. అంతేకాదు అరటి బోదెలను, ఆకులను శుభకార్యాలకు వాడుతారు. అరటి జీర్ణశక్తికి ఉపకరిస్తుంది. లేత అరటికాయ కూర త్వరగా జీర్ణం అవుతుంది. అరటి కాయ కూర వేడి చేసే గుణం కలదు. అరటి పండు చలువు చేసే గుణంకలదు. అరటి జీర్ణకోశవ్యాధులకు అత్యుత్తమమైనది. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణంకావడం కోసం రోజుకొక అరటిపండు తీసుకోవడం మంచిది.
అంతేకాదు కడుపులో ఆమ్లత్వం వున్నవారు తరుచూగా అరటిపండు తీసుకోవడం మంచిది. రక్త విరేచనాలు, జిగట విరేచనాలు అవుతుంటే బాగా మిగలపండిన చక్కెరకేళి అరటి పండును, పాత చింతపండు, పాతబెల్లం మూడింటిని సమపాళ్ళలో తీసుకొని బాగా కలిపి ఒక చెంచా మోతాదు చొప్పున రోజుకు మూడుసార్లు లేక నాలుగుసార్లు తీసుకోవాలి. మలబద్దకాన్ని అరికట్టడానికి అరటి పండును మించిన వైద్యం లేదు.
అరటిపండు బి.పి. వ్యాధిలో బాగా పని చేస్తుంది. అంతేకాదు హృదయ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులలోను, కాలేయ వ్యాధులలోనూ బాగా పనిచేస్తుంది. ఈ వ్యాధులు ఉన్నవారు అరటి ఆకులలో భోజనం చేయడం మంచిది. స్వప్న స్ఖలనాలు, మూత్రంతో పాటుగా వీర్యం బయటకు పోయేటప్పుడు, నపుంసకత్వంలోనూ అరటి బాగా పని చేస్తుంది.