ఆహారాన్ని నెమ్మదిగా నమిలి.. ఆస్వాదిస్తూ తినాలి.. లేదంటే...

బుధవారం, 26 సెప్టెంబరు 2018 (16:50 IST)
కొందరు భోజనం ముందు కూర్చుంటారో లేదో... ఎవరో తరుముకొస్తున్నట్టు గబగబా వేగంగా ప్లేటు ఖాళీ చేసేస్తారు. పక్కవాళ్లు పది ముద్దలు కూడా తినక ముందే మొత్తం ముగించేసే ఈ అలవాటు ఏమాత్రం మంచిది కాదు. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి, ఆస్వాదిస్తూ తినాలి. ఎందుకంటే వేగంగా తినే వారికి ఎంత తిన్నా కడుపు నిండిన భావనే కలగదు. ఎందుకో చూద్దాం.
 
మన కడుపు ఖాళీగా ఉందా? నిండిందా? వంటి సమాచారాన్ని మెదడుకు చేరవేసేందుకు ఒక వ్యవస్థ ఉంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఘ్రెలిన్‌ అనే హార్మోన్‌ విడుదలై ఆకలి వేస్తోందనే సమాచారాన్ని మెదడుకు చేరుస్తుంది. మనం ఆహారం తీసుకోవటం మొదలుపెట్టి కడుపు నిండగానే.. ఆకలి తగ్గిందనే విషయాన్నీ పంపిస్తుంది. 
 
ఈ సమాచారం మెదడుకు చేరటానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. అయితే గబగబా తినేవారిలో ఈ ప్రక్రియ అంతా అస్తవ్యస్తమవుతుంది. దీంతో కడుపు నిండినా ఆకలి తగ్గిందన్న భావన కలగక... తృప్తి అనిపించక.. ఇంకా తినేస్తూనే ఉంటారు. ఫలితంగా అవసరాన్ని మించి ఎక్కువ తినటం, బకాయం బారినపడటం వంటి అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. 
 
ఇలా ఆబగా తినే అలవాటు చాలా వరకూ చిన్నతనంలోనే అలవడుతుంది. ఇది పెద్దయ్యాకా కొనసాగుతుంది. కాబట్టి పిల్లలకు చిన్నప్పట్నుంచే నెమ్మదిగా, బాగా నమిలి, ఆస్వాదిస్తూ తినటం నేర్పించాలి. దీనివల్ల తక్కువే తిన్నా.. తృప్తి కలుగుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు