భస్మం అంటే అర్థమేమిటో తెలుసా..?

శుక్రవారం, 22 మార్చి 2019 (10:37 IST)
భస్మం అనే మాటకు అర్థమేమిటంటే.. భస్మం అనే మాటకు పాపాలను భస్మం చేసేదని పండితులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే భస్మం అనేది భగవంతుడిని జ్ఞాపకం చేసేదని అర్థం. 'భ' అంటే భస్మం చేయడం. 'స్మ' స్మరణమును సూచిస్తున్నాయి. అందువలన భస్మధారణ దుష్టత్వాన్ని నిర్మూలించి, దివ్యత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. భస్మం ధరించిన వారికి శోభనిస్తుంది కనుక విభూతి అనీ, దానిని పెట్టుకున్న వారిని పరిశుద్ద పరచి వారిని అనారోగ్యత, దుష్టశక్తుల నుండి రక్షిస్తుంది కనుక రక్ష అని అంటారు.
 
ఏదైనా ఒక వస్తువును లేదా పదార్ధాన్ని కాల్చినప్పుడు బూడిదగా మారుతుందన్న విషయం అందరికి తెలిసిందే. కానీ బూడిదను కాలిస్తే ఏ మార్పూ జరగదు. ఎంతమాత్రం రూపాంతరం చెందదు. తిరిగి బూడిదే మిగులుతుంది. అంటే బూడిదకు మార్పు లేదు, నాశనం లేదు. నాశనం లేని విభూతితో మార్పులేని మహాశివుని ఆరాధిస్తున్నాం. విభూతి శాశ్వతమైంది, పవిత్రమైంది మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదని పురోహితులు చెబుతున్నారు.
 
నెయ్యి, ఇతర వనమూలికలతో కలిపి ప్రత్యేకమైన సమిధలతో భగవంతునికి హోమంలో ఆహూతిగా సమర్పించినపుడు అందులో నుండి వచ్చిన భస్మమే విభూతి. లేదా విగ్రహానికి భస్మముతో అభిషేకం చేసిన దానిని విభూతిగా పరిగణిస్తారు. అంతే కానీ కాలిన ప్రతి వస్తువు యొక్క బూడిద విభూతిగా పరిగణించబడదని పండితులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు