జయవర్ధనే సూపర్ ఇన్నింగ్స్: భారత్ లక్ష్యం 275 పరుగులు!

భారత్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ పోరులో జయవర్ధనే సెంచరీతో కదంతొక్కడంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 274 పరుగులు సాధించగలిగింది. జయవర్ధనేతో పాటు సంగక్కర (48), దిల్షాన్ (33), కులశేఖర (32)లు నిలకడగా రాణించడం ద్వారా శ్రీలంక భారత్‌కు 275 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించగలిగింది.

ముంబై వాఖండే స్టేడియంలో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ పోరులో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. తద్వారా ఫీల్డింగ్‌కు దిగిన భారత క్రికెటర్లు తొలి 23 ఓవర్ల వరకు మెరుగ్గా బౌలింగ్ చేశారు. అయితే 88 బంతుల్లో 13 ఫోర్లతో జయవర్ధనే శతకం సాధించి శ్రీలంక స్కోరు పెరిగేలా చేశాడు. అలాగే జయవర్ధనేకు కులశేఖర అద్భుత భాగస్వామ్యం నెలకొల్పడం ద్వారా లంక భారీ స్కోరు నమోదు చేసుకుంది.

అంతకుముందు ఓపెనర్లుగా బరిలోకి దిగిన తరంగ (2), దిల్షాన్ (33)లు భారత బౌలర్ల ధాటికి అవుట్ కాగా, సంగక్కర కేవలం రెండు పరుగుల తేడాతో అర్థశతకాన్ని చేజార్చుకుని యువీ బంతికి తలొగ్గాడు. 67 బంతులాడిన సంగక్కర ఐదు ఫోర్లతో 48 పరుగులు సాధించాడు.

ఇక సమరవీర (21), కపుగెడెదర (1)లు యువీ, జహీర్ బంతికి వికెట్లు సమర్పించుకున్నారు. చివరికి జయవర్ధనే (103), పెరెరా (22)లు నాటౌట్‌గా నిలిచారు. తద్వారా శ్రీలంక 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో జహీర్‌ఖాన్, యువరాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్భజన్‌కు ఒక వికెట్ దక్కింది.

వెబ్దునియా పై చదవండి