ప్రపంచకప్ 2011 తొలి సెమీఫైనల్: లంక లక్ష్యం 218

మంగళవారం, 29 మార్చి 2011 (19:44 IST)
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక- న్యూజీలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి సెమీఫైనల్లో కివీస్ ప్రత్యర్థి జట్టు శ్రీలంకకు 218 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచిన న్యూజీలాండ్ బ్యాటింగ్ ఎంచుకున్నది.

ఓపెనర్లుగా దిగిన గుప్టిల్ - మెక్ కల్లమ్ లు ధాటిగా ఆడేందుకు యత్నించారు. అయితే శ్రీలంక బౌలర్ హెరాత్ వేసిన ప్రమాదకర బంతికి కల్లమ్(13) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 32 పరుగుల వద్ద కివీస్ తొలి వికెట్టును కోల్పోయింది. అనంతరం రైడర్(19) వచ్చాడు. రెండు ఫోర్లతో మురిపించాడు. అయితే స్పిన్ మాంత్రికుడు మురళీధరన్ వేసిన బంతిని తాకి సంగక్కరకు దొరికిపోయాడు.

ఇక అప్పట్నుంచి కివీస్ ఆచితూచి ఆడటం మొదలుపెట్టింది. అయినప్పటికీ మలింగ గుప్టిల్(39)ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన టేలర్(36), స్టైరిస్ (57) బాధ్యతాయుతంగా ఆడారు. స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. అయితే అది ఎంతోసేపు నిలువలేదు.

మెండిస్ బౌలింగులో టేలర్, మురళీధరన్ బౌలింగులో స్టైరిస్ అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్సమన్లు వచ్చినంత వేగంగా వెళ్లేందుకే ఉత్సాహం చూపించినట్లు కనిపించారు. విలియమ్సన్(22), మెక్ కల్లమ్(9), ఓరమ్(7), సౌథీ, మెక్ కే డకవుట్లుగా విఫలమవడంతో కివీస్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆలౌటైంది.

వెబ్దునియా పై చదవండి