సఫారీల టీమ్ కోచ్‌గా భారత కోచ్ గ్యారీ కిర్‌స్టన్..!?

టీమిండియా కోచ్ గ్యారీ కిర్‌స్టన్ తన సొంత క్రికెట్ జట్టు అయిన దక్షిణాఫ్రికాకు కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. వరల్డ్ కప్ పోటీల్లో టీమిండియా జట్టును గెలుపు దిశగా నడిపించిన గ్యారీ కిర్‌స్టన్ భారత జట్టు కోచ్‌గా తప్పుకోనున్నట్లు సమాచారం. తద్వారా సఫారీల జట్టుకు గ్యారీ శిక్షణ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

గ్యారీ కిర్‌స్టన్ టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కాలం నుంచి మహేంద్ర సింగ్ ధోనీ నమోదు చేసుకున్న విజయాలను బట్టి, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తన సొంత జట్టుకు కోచ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాలని అడిగింది. కానీ ప్రస్తుతానికి తానెలాంటి నిర్ణయమూ తీసుకోలేదని గ్యారీ వెల్లడించారు.

ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత యువ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సురేష్ రైనా కిర్‌స్టన్‌ను తమ భుజాలపై ఎత్తుకుని ముంబైలోని వాంఖడే మైదానం చుట్టూ కలియ తిప్పారు.

కాగా టీమిండియాకు గ్యారీ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న సందర్భంలో భారత్ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంతో పాటు వన్డే ప్రపంచకప్‌ను కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్యారీని తమ జట్టుకు కోచ్‌గా తీసుకోవాలని దక్షిణాఫ్రికా క్రికెటర్లు సైతం బోర్డుకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

అయితే మాస్టర్, ధోనీతో పాటు టీమిండియా సభ్యులంతా గ్యారీ పదవీ కాలాన్ని పొడిగించాలని, ఆయన టీమిండియా కోచ్‌గా కొనసాగాలని ఆశిస్తున్నారు. మరి గ్యారీ కిర్‌స్టన్ టీమిండియా కెప్టెన్‌గా కొనసాగుతారా లేదా సొంత జట్టుకు శిక్షణ ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే..!

వెబ్దునియా పై చదవండి