దేశ తొలి మహిళా అధ్యక్షురాలు ప్రతిభా పాటిల్

PTI PhotoPTI
భారత దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికి దేశ అధ్యక్ష పీఠాన్ని ఓ మహిళ అధిరోహించేందుకు అరవై ఏళ్ళకాలం పట్టింది. ఆ అరుదైన అవకాశాన్ని రాజస్థాన్ మాజీ గవర్నర్ ప్రతిభా పాటిల్ దక్కించుకున్నారు. భారత దేశ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. దేశ 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ప్రతిభా పాటిల్ 1934 డిసెంబరు 19వ తేదీన మహారాష్ట్రలోని నడగాన్‌లో జన్మించారు.

ముంబై విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలైన ప్రతిభా పాటిల్, టేబుల్ టెన్నిస్‌ క్రీడలో ఛాంపియన్. 1962లో ఎంజే కాళాశాల 'క్వీన్‌'గా ఎన్నికైన ప్రతిభా పాటిల్ అదే సంవత్సరంలో కాంగ్రెస్ తరపున ఎడ్లబాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

అనంతరం 1965 జులై ఏడో తేదీన దేవీసింగ్ రాణీసింగ్ షెకావత్‌ను వివాహమాడిన ప్రతిభకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 1962 సంవత్సరంలో 27 ఏళ్ళ ప్రాయంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రతిభా పాటిల్ 1967 నుంచి 1985 వరకు మహారాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో మంత్రిగా పనిచేశారు. అనంతరం రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన ప్రతిభా పాటిల్ 1985 నవంబరు 18వ తేదీన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

1986-88 మధ్య కాలంలో రాజ్యసభలో కమిటీ ఆఫ్ ప్రివిలేజ్ ఛైర్మన్‌గాను, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. 1991-96 మధ్య కాలంలో లోక్‌సభ హౌస్ కమిటీ ఛైర్మన్‌గాను, 2004 నవంబరు ఎనిమిదో తేదీన రాజస్థాన్ గవర్నర్‌గా నియమితులైన ప్రతిభాపాటిల్ 2007 జులై 25వ తేదీన భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు.

వెబ్దునియా పై చదవండి