దేశభక్తి మూర్తీభవించిన మార్క్సిస్టు 'మణిదీపం'

FileFILE
అది 1932 సంవత్సరం. తెల్లదొరల ప్రభుత్వ పరిపాలన. మరోవైపు స్వాతంత్ర్య పోరాటం జోరుగా సాగుతున్న రోజులు. పంజాబ్‌ రాష్ట్రంలోని హోషియార్ జిల్లాలో ఎటు చూసినా స్వాతంత్ర్య పోరాట ఆందోళనలే. అపుడే.. నూగునూగు మీసాలు కలిగిన యువకుడు. బ్రిటీష్ పాలకుల ఆదేశాలను ధిక్కరించాడు. ప్రభుత్వ భవనంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. అంతేకాదు.. కోర్టుకు హాజరై.. తానే మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసిన భరతమాత ముద్దుబిడ్డను అంటూ.. రొమ్మువిరిచి చెప్పిన యువతేజం. ఆ యువకుడే హరికిషన్ సింగ్ సుర్జీత్.

శరీరంలోని ప్రతి అణువూ దేశభక్తి నిండిన ఈయన.. 93 సవంత్సరాల వృద్ధాప్యంలో కన్నుమూశారు. 1916 మార్చి 23న పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ జిల్లా రూపోవాల్‌లో జన్మించిన సుర్జీత్.. కన్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా స్వార్థ రాజకీయ శక్తుల నుంచి భరతజాతిని రక్షించేందుకు తుదికంటా కృషి చేసిన పోరాట యోధుడు హరికిషన్. కేవలం మెట్రిక్యులేషన్ వరకు మాత్రమే విద్యాభ్యాసం చేసిన ఆయన.. మార్క్సిస్టు పార్టీలో మహోపాధ్యాయుని పాత్ర పోషించారు.

ముఖ్యంగా.. భిన్నధృక్పథాలు కలిగిన అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత సుర్జీత్‌కే చెల్లుతుంది. మతోన్మాదం కంటే ప్రమాదమైనది మరొకటి లేదనే నిర్మొహమాటంగా ప్రకటించి, లౌకిక శక్తులన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి, దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు నాంది పలికారు. స్వచ్ఛమైన మార్క్సిస్టు వాదిగా ఉంటూ బూర్జువా పార్టీలతో తిరగడమేమిటనే విమర్శలను సైతం ఆయన ఎదుర్కొన్నారు. వీటిని పెద్దగా పట్టించుకోని సుర్జీత్‌ను కాంగ్రెస్ కమ్యూనిస్టు నేతగా ఎంతోమంది అభివర్ణించారు.

అధికారం కోసం ఎన్నడూ పాకులాడని ఈ యోధుడు.. 1992 నుంచి 2005 వరకు నిరంతరాయంగా పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు. చొరవ, సంప్రదింపుల నైపుణ్యాన్ని కలిగిన సుర్జీత్.. అసాధారణ పరిణితిని కలిగివుండటం ఆయనకే సొంతం. దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొన్నపుడల్లా.. తన ప్రత్యేక పంథాతో సంక్షోభాన్ని పరిష్కరించారు.

FileFILE
ముఖ్యంగా.. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కొలువుదీర్చడం, దేవెగౌడ రాజీనామా అనంతరం లౌకిక పార్టీలన్నింటినీ కట్టుగా వుంచి ఐకే.గుజ్రాల్‌ను ప్రధానమంత్రిగా తెరపైకి తీసుకురావడం వంటివి సుర్జీత్ రాజకీయ పరిణితికి నిదర్శనం. పార్టీలంటే వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయడం కాదు. అవసరమైతే దేశంలోని ఇతర భావ సారూప్య పార్టీలను కలుపుకుని ముందుకు సాగడమేనని ఆయన పేర్కొన్నారు.

పదవుల కోసం పార్టీలను మంచినీళ్ళ ప్రాయంగా మార్చుతూ నోట్ల కట్టలకు అమ్ముడు పోయే నేతలున్న నేటి ప్రజాస్వామ్య భారతంలో సుర్జీత్ ఖచ్చితంగా అలాంటి వారికి మార్గదర్శకుడు. ఎన్నో మార్లు ఉన్నత పదవులను చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ సుర్జీత్ మాత్రం.. తృణప్రాయంగా కాదన్నారు. పదవులు ఉన్న సమయంలోనే పలుకుబడి కోసం ప్రాకులాడే నేతలు ఎందరో ఉన్నారు.

అయితే సుర్జీత్‌కు ఎలాంటి పదవులు లేకపోయినా, ఆయన మాటల పట్ల కమ్యూనిస్టు కార్యకర్తలకు, నేతలతో సహా పలు రాజకీయ పార్టీల వద్ద ఎనలైని గౌరవం ఉంది. ఓ మాట చెపితే చాలు.. క్షణాల్లో పనులు పూర్తి కావడం ఆయన అధికారంలో లేని 'పవర్‌'కు సాక్ష్యం. పార్టీ కార్యకలాపాల కోసం ఢిల్లీకి వచ్చే కార్యకర్తలకు ఆతిథ్యం ఇచ్చేందుకు పార్టీ నేతలు నానా తంటాలు పడే వారు. ఇది తెలిసిన మరుక్షణమే సుర్జీత్ ఢిల్లీలోని పలువురి ప్రముఖుల ఇళ్ళకు ఫోన్ చేసిన మరుక్షణమే రాజధానిలోని 'గురుద్వారా'లన్ని కార్యకర్తల కోసం తలుపులు తెరుచుకునేవి.

ఇలాంటి సంఘటనలెన్నో సుర్జీత్ జీవిత చరిత్రలో ఉన్నాయి. సాధారణంగా.. పార్టీ కార్యకలాపాల్లో మినహా ఇతర పనులపై అంతగా దృష్టి సారించని ఈ నేత.. పార్టీని బలోపేతం చేస్తూ.. విదేశాల్లో పర్యటిస్తూ ఉండేవారు. పార్టీ సిద్ధాంతవాదులకు కార్యకర్తల మధ్య సుర్జీత్ ఒక వారధిలా ఉండేవారు. తలపై తెల్లటి తలపాగా, చెరగని చిరునవ్వుతో ఎల్లపుడూ కనిపించే ఈ కురువృద్ధుని మృతి కేవలం కమ్యూనిస్టు పార్టీకే కాకుండా.. దేశానికి తీరని లోటే.