కామన్వెల్త్ గేమ్స్ ఆరంభోత్సవాలకు డయానా వచ్చిందట!

FILE
దేశ రాజధాని నగరం ఆతిథ్యమిస్తోన్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో ఆది నుంచే ఎన్నో పొరపాట్లు చోటు చేసుకున్నాయి. ఒకవైపు అవినీతి కుంభకోణం మరోవైపు కామన్వెల్త్ ఏర్పాట్లలో డొల్లతనం వెలుగులోకి రావడంతో తలపట్టుకుని కూర్చున్న సీడబ్ల్యూజీ ఛైర్మన్ సురేష్ కల్మాడీ.. అట్టహాసంగా నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్ ఆరంభ వేడుకలకు విచ్చేసిన ప్రముఖుల్లో బ్రిటన్ యువరాణి డయానా కూడా ఉన్నారని వ్యాఖ్యానించి వార్తల్లోకి ఎక్కారు.

అంగరంగవైభవంగా ప్రారంభమైన కామన్వెల్త్ క్రీడా సంబరాల్లో బ్రిటన్ యువరాణి డయానా హాజరైనందుకు ధన్యవాదాలు. అవును ఆమె హాజరైంది’ అని కామన్వెల్త్ క్రీడల సారథి సురేష్ కల్మాడీ అన్నారు. ఇదేంటి..? 1997లో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన ఆమె ఇక్కడెలా ప్రత్యక్షమైందని విలేకరులు ఆశ్చర్య పోతుండగానే తన పొరపాటు తెలుసుకున్న కల్మాడీ వెంటనే నాలుక కరచుకున్నారు.

కామన్వెల్త్ క్రీడల ప్రారంభ కార్యక్రమం తదితర అంశాల గురించి ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, బ్రిటన్ రాణి డయానా కూడా హాజరయ్యారు అని అన్నారు. ఆ తర్వాత గొంతు సవరించుకుంటూ బ్రిటిష్ యువరాజు చార్లెస్, కెమిల్లా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారని, ఈ సంబరాన్ని ఏర్పాట్లను ప్రశంసించారని కల్మాడీ వెల్లడించారు. దీంతో విలేకరులంతా కామన్వెల్త్ గేమ్స్ ఆరంభోత్సవంలో డయానానా ఇదేం గొడవరా బాబూ అంటూ నవ్వుకున్నారట..!

అలాగే.. కామన్వె ల్త్ క్రీడా పోటీలు జరుగుతున్న వేదికలు ప్రేక్షకులు లేక వెలవెలపోతుండడంతో వాటిని నింపడానికి పిల్లల కోసం ఉచితంగా టికెట్లను బయటకు ఇవ్వాలనే అంశాన్ని క్రీడల నిర్వాహక కమిటీ పరిశీలిస్తోంది. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకున్నట్లు నిర్వాహక కమిటి చైర్మన్ సురేశ్ కల్మాడి చెప్పారు.

ఆదివారం అట్టహాసంగా క్రీడోత్సవాలు ప్రారంభం కాగా, సోమవారం నుంచి అసలు పోటీలు జరుగుతున్నాయి. అయితే ఈ పోటీలు జరుగుతున్న వేదికలు ఖాళీగా ఉంటున్నాయి. వేదికల వద్ద మాత్రమే టికెట్లు ఇచ్చే కౌంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ఈ సమస్య తలెత్తిందని కల్మాడి పేర్కొన్నారు. తమకు ‘ఆందోళన కలిగిస్తున్న అంశాల్లో ప్రేక్షకులు కరువైన వేదికలు’ ఒకటని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సిజిఎఫ్) అధ్యక్షుడు మిచెల్ ఫెన్నల్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి