అణు ఒప్పందాలకు ఎన్ఎస్‌జీ మినహాయింపు

అణు ఇంధనం శుద్ధి, రీప్రాసెసింగ్‌కు సంబంధించిన అణు సాంకేతిక పరిజ్ఞానాలను ఇతర దేశాలకు బదిలీ చేయడాన్ని నిరోధించాలని ఈ నెల ప్రారంభంలో జి-8 పారిశ్రామిక దేశాలు ఇప్పటికీ తీర్మానించినప్పటికీ, భారత్ ఈ సాంకేతిక పరిజ్ఞానం పొందేందుకు వేరొక మార్గాన్ని ఆశ్రయిస్తోంది.

పలు దేశాలతో కుదుర్చుకుంటున్న ద్వైపాక్షిక అణు సహకార ఒప్పందాల కోసం అణు ఇంధన సరఫరా గ్రూపు (ఎన్ఎస్‌జీ) తమకు కల్పించిన ప్రత్యేక మినహాయింపును ప్రాతిపదికగా తీసుకోవాలని భారత్ కోరుతోంది. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ గురువారం మాట్లాడుతూ.. భారత్ ఇతర దేశాలతో అణు ఒప్పందాలు ఎన్ఎస్‌జీ మినహాయింపు ప్రాతిపదికన కోరుకుంటోందన్నారు.

అమెరికా కంపెనీలు దేశంలో ఏర్పాటు చేసే రెండు అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని కృష్ణ తెలిపారు. ఈ చర్చల్లో అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రదేశాలను ఖరారు చేయనున్నట్లు చెప్పారు. థాయ్‌లాండ్‌లోని పుకెట్ నగరంలో జరిగిన ఏషియాన్- ఇండియా, ఏషియాన్ ప్రాంతీయ సదస్సులలో పాల్గొని భారత్ తిరుగు పయనమైన సందర్భంగా ఎస్ఎం కృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి