అమెరికాతో చర్చలకు ఉత్తర కొరియా ఓకే?

అణు కార్యక్రమం, క్షిపణి ప్రయోగాలతోపాటు, ఇతర వివాదాస్పద అంశాలపై అమెరికా ప్రభుత్వంతో ప్రత్యక్ష చర్చలు జరిపేందుకు ఉత్తర కొరియా సుముఖంగా ఉన్నట్లు ఓ వార్తాపత్రిక కథనం వెల్లడించింది. ఉత్తర కొరియా వివాదాస్పద అణు కార్యక్రమంపై అమెరికాతోపాటు, ఇతర అగ్రరాజ్యాలు ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే.

ఇటీవల ఉత్తర కొరియా రెండో అణు పరీక్ష నిర్వహించడంతోపాటు, ఆ తరువాత వరుసగా క్షిపణి పరీక్షలు చేపట్టడంతో ఆ దేశంపై అగ్రరాజ్యాల ప్రోద్బలంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది. పశ్చిమ దేశాలతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అమెరికాతో నేరుగా చర్చలు జరిపేందుకు ఉత్తర కొరియా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తాము ప్రత్యక్ష చర్చలకు వ్యతిరేకం కాదని, సంయుక్త ఆందోళనకర అంశాలపై తాము ఎటువంటి చర్చలను వ్యతిరేకించడం లేదని ఐక్యరాజ్యసమితిలో ఉత్తర కొరియా దౌత్యాధికారిగా వ్యవహరిస్తున్న సిన్ శాన్‌హో చెప్పినట్లు జపాన్‌కు చెందిన క్యోడో వార్తా సంస్థ శుక్రవారం వెల్లడించింది.

ఇదిలా ఉంటే సిన్ శాన్ హో న్యూయార్క్‌లో మాట్లాడుతూ ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, అమెరికా, జపాన్, చైనా, రష్యాలతో గతంలో జరిగిన ఆరు దేశాల చర్చలు పునఃప్రారంభమయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆరు దేశాల చర్చావేదికకు శాశ్వితంగా తెరపడినట్లేనని పేర్కొన్నారు. అయితే అమెరికా మాత్రం ఆరు దేశాల చర్చావేదికపైనే ఉత్తర కొరియాతో చర్చలు జరిపేందుకు సముఖంగా ఉంది.

వెబ్దునియా పై చదవండి