అల్‌ఖైదా ఉగ్రవాదసంస్థ పాకిస్థాన్‌లోని ఫాటా ప్రాంతంనుంచే అమెరికాపై దాడి చేయగలదని ఆ దేశం అనుమానం వ్యక్తం చేసింది.
ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ప్రముఖ ఉగ్రవాద సంస్థ అయిన అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లోని ఫాటా ప్రాంతంలోనే తల దాచుకుని ఉన్నాడని, అతను, అతని సభ్యులు అక్కడినుంచే అమెరికాపై దాడులకు పాల్పడగలరని అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మెన్ ఎడ్మిరల్ మైఖేల్ ములేన్ తెలిపారు.
ములేన్ అల్ జజీరా టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ...అల్‌ఖైదాను అంతమొందించడమే అమెరికా ప్రథమ లక్ష్యమని ఆయన అన్నారు. అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ తలదాచుకుని ఉన్న స్థావరాన్ని మీరు తెలుసుకునికూడా అతనిపై దాడులకు ఎందుకు పాల్పడలేదనే ప్రశ్నకు సమాధానమిస్తూ... లాడెన్ ప్రధాన స్థావరమైన ఫాటా ప్రాంతం పాకిస్థాన్‌లో ఉందని, కాబట్టి అక్కడ తాము దాడులకు పాల్పడలేమని ఆయన అన్నారు.
ఇదిలావుండగా పాక్‌లోని వాయువ్య ప్రాంతంలోనున్న తీవ్రవాదులపై పాకిస్థాన్ సైనికులు జరిపిన దాడులపట్ల ఆయన ప్రశంసలు కురిపించారు.
కాగా ప్రస్తుతం పాక్ సైనికులు ప్రస్తుత ప్రభుత్వ సహాయ సహకారాలతో అక్కడు్న్న ఉగ్రవాదులను అంతమొందించడానికి తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.
ఉగ్రవాదులపై జరుగుతున్న ఈ పోరులో పాక్ సైనికులు దాదాపు వెయ్యికిపైగా ఆశువులు బాసారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆ దేశాన్ని కాపాడే నేపథ్యంలో సైనికుల బలిదానం మరువలేనిదని ఆయన సైనికుల మనోధైర్యాన్ని కొనియాడారు.
అల్‌ఖైదాకు చెందిన ఒసామా బిన్ లాడెన్‌తో సహా అనేకమంది తీవ్రవాదులు పాకిస్థాన్‌లో తలదాచుకుని ఉన్నారని ఆయన అన్నారు. పాక్‌లో అమెరికా సైన్యం ఉన్నారన్నదానిపై అనుమానాలు వద్దని, అక్కడ తమ సైనికులు ఎవ్వరూ లేరని ఆయన స్పష్టం చేశారు. కాని ప్రస్తుతం తమ సైన్యం పాక్ సైన్యానికి తగిన శిక్షణ ఇస్తున్నదని ఆయన తెలిపారు.