ఇరాన్‌లో విమాన ప్రమాదం: 17 మంది మృతి

ఇరాన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ముష్షాద్‌లో శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. గడిచిన పది రోజుల్లో ఇరాన్‌లో ఇది రెండో విమాన ప్రమాదం. ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశ రాజధాని టెహ్రాన్ నుంచి ముష్షాద్‌కు బయలుదేరిన ప్రయాణిక విమానంలో మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు. మంటల్లో చిక్కుకున్న ఈ విమానాన్ని రష్యా తయారు చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 153 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలను పూర్తిగా నియంత్రణలోకి తీసుకొచ్చే ముందు విమానంలోని ప్రయాణికులను, మృతదేహాలను, గాయపడినవారిని బయటకు తీసుకొచ్చామని అధికారిక వర్గాలు తెలిపాయి.

విమానం ముష్షాద్‌లో ల్యాండింగ్ అవుతున్న సమయంలో చక్రాలు మంటల్లో చిక్కుకున్నాయి. దీంతో రన్‌వే నుంచి పక్కకు వెళ్లి ఈ విమానం గోడను ఢీకొంది. ఈ ప్రమాదం అంతర్జాతీయ కాలమానం ప్రకారం శుక్రవారం 1340 గంటలకు జరిగింది. వెంటనే అప్రమత్తమైన అధికారిక యంత్రాంగం విమానంలోని చాలా మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించగలిగింది.

వెబ్దునియా పై చదవండి