ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగాయి: నెజాద్

ఇరాన్‌లో తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగాయని ఆ దేశ అధ్యక్షుడు మొహమౌద్ అహ్మదీనెజాద్ పేర్కొన్నారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించి అహ్మదీనెజాద్ తిరిగి దేశ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రత్యర్థులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఆరోపణలతో ప్రత్యర్థుల మద్దతుదారులు శనివారం దేశ రాజధాని టెహ్రాన్‌లో పెద్దఎత్తున విధ్వంసానికి దిగారు. ఇరాన్ ఎన్నికల సంఘం శుక్రవారం ఎన్నికల నిర్వహించి, శనివారం ఫలితాలు వెల్లడించింది. ఈ ఎన్నికల్లో నెజాద్ అఖండ విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన తీరుపై విమర్శలు రావడంపై.. నెజాద్ ఆదివారం స్పందించారు.

ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా జరిగాయని తెలిపారు. తాజా ఎన్నికల్లో దేశ శక్తిని, భవిష్యత్‌ను మెరుగుపరుస్తాయని నెజాద్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నెజాద్ విలేకరులు సమావేశం జరిగిన ప్రదేశానికి మైలు దూరంలో ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. ఎన్నికల్లో మోసం జరిగిందని ప్రత్యర్థి మౌసావి మద్దతుదారులు పోలీసులతో ఘర్షణలకు దిగారు.

వెబ్దునియా పై చదవండి