కరాచీలో ఆసియా అతిపెద్ద మురికివాడ: ఐరాస

అందరూ అనుకుంటున్నట్లుగా ఆసియాలో అతిపెద్ద మురికివాడ భారత ఆర్థిక రాజధాని ముంబయిలో లేదు. ముంబయిలోని ధారవి ప్రాంతాన్ని ఇప్పటివరకు అందరూ ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా భావిస్తున్నారు. అయితే వాస్తవానికి ఆసియాలో అతిపెద్ద మురికివాడ పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఉంది.

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) నివేదికను పరిశీలిస్తే ఇదే విషయం తెలుస్తుంది. ఆసియా అతిపెద్ద మురికివాడ స్థానాన్ని ధారవి నుంచి కరాచీలోని ఓరంగి టౌన్‌షిప్ పొందిందని యూఎన్‌డీపీ పేర్కొంది. ఇప్పుడు ధారవి కంటే ఓరంగి టౌన్‌షిప్ పెద్ద మురికివాడగా అవతరించింది. ముంబయి మహానగరానికి సంబంధించి యూఎన్‌డీపీ సహకారంతో తయారు చేసిన మానవాభివృద్ధి నివేదికను బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) విడుదల చేసింది.

మెక్సికో నగరం నెజా- చాల్కో- ఐట్జా బారియోలో నివసించి జనాభాకు నాలుగురెట్ల మంది ప్రజలు ధారవిలో నివసిస్తున్నారు. ధారవి మురికివాడలో 57 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతం 175 హెక్టార్లలో విస్తరించివుంది. ధారవి ప్రాంత అభివృద్ధికి అమెరికాలో శిక్షణ పొందిన ఆర్కిటెక్ట్ ముకేష్ మెహతా రూ.9250 కోట్ల వ్యయంతో ధారవి పునఃనిర్మాణ ప్రాజెక్టు (డీఆర్‌పీ)ని రూపొందించారు. దీనికి 2004లోనే ఆమోదం లభించినా, ఇప్పటివరకు అమలుకు మాత్రం నోచుకోలేదు.

వెబ్దునియా పై చదవండి