కొత్త ఇమ్మిగ్రేషన్ విధానంపై ఈయూ దృష్టి

యూరోపియన్ యూనియన్ (ఈయూ) కొత్త ఇమ్మిగ్రేషన్ విధానానికి రూపకల్పన చేయడంపై దృష్టిపెట్టింది. ఈ ఏడాది అక్టోబరునాటికి ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ విధానాన్ని యూరోపియన్ యూనియన్ సిద్ధం చేయాలనుకుంటుంది.

స్వీడన్ విదేశాంగ మంత్రి విదేశాంగ మంత్రి కార్ల్ బిల్డ్ మాట్లాడుతూ.. ఆఫ్రికా నుంచి పెరిగిపోతున్న వలసల సమస్యపై యూరోపియన్ దేశాల మధ్య మరింత సమన్వయం కోసం ఇటలీ చేసిన ప్రతిపాదనకు ఈయూ సానుకూలంగా స్పందించిందన్నారు.

ఆఫ్రికా నుంచి యూరోపియన్ దేశాలకు, ముఖ్యంగా ఇటలీకి వలసలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో.. కొత్త ఇమ్మిగ్రేషన్ విధానాన్ని పరిశీలించిన అవశ్యకత ఏర్పడిందని స్వీడన్ మంత్రి తెలిపారు.

ఈ వలసల సమస్యను ఇటలీ సమస్యగా కాకుండా, యూరోపియన్ దేశాల సమస్యగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. యూరప్ సరిహద్దులకు వలసదారులు వచ్చిన వెంటనే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఎవరూ ఇప్పటివరకు మాట్లాడలేదన్నారు.

అక్టోబరు మాసాంతంలో కొత్త ఇమ్మిగ్రేషన్ విధానంపై యూరోపియన్ దేశాల విదేశాంగ మంత్రులు చర్చలు జరపనున్నారు. ఈ సమస్య పరిష్కారం దిశగా దీనిని తొలి అడుగుగా పరిగణించారు. ఒక్క సమావేశంతోనే సమస్య పరిష్కారం కాదని స్వీడన్ మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి