పాకిస్థాన్‌లోని సమస్యాత్మక స్వాత్ లోయలో తాలిబాన్ తీవ్రవాదులను అణిచివేసేందుకు సైన్యం చేపట్టిన ఆపరేషన్ చివరి దశకు చేరుకుందని ఆ దేశ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ చెప్పారు. స్వాత్‌లో చేపట్టిన సైనిక ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో తీవ్రవాదులు హతమయ్యారని, వీరిలో ప్రధాన తీవ్రవాద నేతలు కూడా ఉన్నారని గిలానీ తెలిపారు.
దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన తాలిబాన్ తీవ్రవాదుల ప్రాబల్యాన్ని అణిచివేసేందుకు సైన్యం కొన్ని నెలల క్రితం సైనిక చర్య చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సైనిక చర్య ముగింపు దశకు చేరుకుందని, స్వాత్ అభివృద్ధిపై ఇప్పుడు ప్రభుత్వం దృష్టిసారిస్తోందని గిలానీ ఓ ఆన్‌లైన్ వార్తా సంస్థతో చెప్పారు.
కరాచీలో టెక్స్‌టైల్ సిటీని ప్రారంభించిన సందర్భంగా గిలానీ ఈ వ్యాఖ్యలు చేశారు. "తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్" తీవ్రవాద సంస్థ చీఫ్ బైతుల్లా మెహసూద్‌ను పట్టుకునే వరకు స్వాత్‌లో సైనిక చర్య కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన తొలి టెక్స్‌టైల్ విధానం దేశంలో ఉద్యోగాలు సృష్టిస్తుందని గిలానీ నమ్మకం వ్యక్తం చేశారు.