తైవాన్‌లో తుపాను మృతుల సంఖ్య 292

తైవాన్‌లో ఇటీవల విలయతాండవం చేసిన మొరాకోత్ తుపాను కారణంగా 292 మంది మృతి చెందారని ఆ దేశ ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. మొరాకోత్ తుపాను కారణంగా తైవాన్‌లో భారీ వర్షాలు కురవడంతో పెద్దఎత్తున వరదలు సంభవించాయి. వరదల కారణంగా లక్షలాది మంది పౌరులు నిరాశ్రయాలయ్యారు.

అధికారిక యంత్రాంగం ఇప్పటివరకు 500 మందికిపైగా పౌరులు వరదల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో మృతి చెంది ఉంటారని అంచనా వేసింది. అయితే తాజాగా తైవాన్ ప్రభుత్వం మృతుల సంఖ్య 292గా ప్రకటించింది. ఇప్పటికీ 385 ఆచూకీ తెలియరాలేదని వెల్లడించింది. తైవాన్ గత అర శతాబ్దకాలంలో ఎన్నడూ ఈ స్థాయిలో వరద భీభత్సాన్ని చూడలేదు.

ఇదిలా ఉంటే దక్షిణ తైవాన్‌లోని సియావోలిన్ అనే గ్రామం భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో పూర్తిగా భూస్థాపితమైంది. ఈ గ్రామంలో 311 మంది పౌరుల ఆచూకీ గల్లంతైంది. వీరిని కూడా తాజా గణాంకాల్లో చేర్చామని తైవాన్ జాతీయ అగ్నిమాపక సంస్థ (ఎన్ఎఫ్ఏ) తెలిపింది. తైవాన్‌లో మొరాకోత్ తుపాను కారణంగా మూడు మీటర్ల వర్షపాతం నమోదయింది.

వెబ్దునియా పై చదవండి