నాటో, రష్యా మిలిటరీ సంబంధాల పునరుద్ధరణ

గత ఏడాది జార్జియా యుద్ధం సందర్భంగా తెగిపోయిన నాటో- రష్యా మిలిటరీ సంబంధాల పునరుద్ధరణకు ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. నాటో, రష్యా విదేశాంగ మంత్రుల సమావేశంలో శనివారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జార్జియాపై గత ఏడాది రష్యా యుద్ధానికి దిగిన అనంతరం నాటో కూటమి‌తో ఆ దేశ మిలిటరీ సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే.

అనంతరం రష్యా, నాటో రాజకీయ సంబంధాలు పునరుద్ధరించబడినప్పటికీ, మిలిటరీ సంబంధాల విషయంలో మాత్రం ఇరుపక్షాలు ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోలేదు. తాజా సమావేశంలో మిలిటరీ సంబంధాలు కూడా పునరుద్ధరించేందుకు నాటో, రష్యాలు అంగీకరించాయి. ఈ విషయాన్ని సమావేశం అనంతరం నాటో ప్రధాన కార్యదర్శి జాప్ డి హూప్ విలేకరులతో చెప్పారు.

ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్థాన్‌కు ఆయుధాల సరఫరాకు తమ భూభాగాన్ని ఉపయోగించుకునేందుకు నాటో సేనలను రష్యా అనుమతించనుందా లేదా అనే విషయం ఇప్పటికీ అస్పష్టంగానే మిగిలివుంది. మిలిటరీ సహకారం విషయంలో కొన్ని అంశాలపై ఇప్పటికీ చర్చలు జరపాల్సి ఉందని హూప్ తెలిపారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ శనివారం 28 దేశాల నాటో కూటమి విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు.

వెబ్దునియా పై చదవండి