బలూచిస్థాన్‌లో ఉన్న అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకే భారత్ పేరును పాకిస్థాన్ ప్రస్తావిస్తోందని బలూచిస్థాన్ మానవహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి సమద్ బలోచ్ ఆరోపించారు. బలూచిస్థాన్ వ్యవహారంలో భారత్ జోక్యం చేసుకుంటుందని పాక్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు.
దీనిపై ఆయన గురువారం మాట్లాడుతూ.. బలూచిస్థాన్ పాక్‌లో ఓ అంతర్భాగం. ఇది భారత్‌లో లేదు. భారత్‌ను నిందించేందుకు ఇది సరిహద్దు ప్రాంతం కాదు. భారత్ పేరును వాడుకోవడం పాక్ అనుసరించే పాత ట్రిక్కుల్లో ఇదీ ఒకటి అని ఆయన అన్నారు. ఇటీవల ఈజిప్టులో జరిగిన నామ్ సదస్సులో బలూచిస్థాన్ అంశంపై భారత్-పాక్‌లు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేయడం పాక్ సాధించిన ద్వౌపాక్షిక విజయంగా పేర్కొనడాన్ని ఆయన తోసిపుచ్చారు.
బలూచిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులు ప్రధాన కారణం పాక్ యంత్రాంగమే. ఇక్కడి అమాయక ప్రజలపై పాక్ సైనికులు రసాయన ఆయుధాలు, హెలికాఫ్టర్ గన్‌షిప్స్, పలు రకాల ఆయుధాలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఇవన్నీ ఆఫ్గనిస్థాన్‌లో తిష్టవేసిన తీవ్రవాదాన్ని అణిచి వేసేందుకు నాటో దళాలు సమకూర్చినవిగా సమద్ బలోచ్ పేర్కొన్నారు. భారత్, ఇరాన్ వంటి దేశాలు ముందుకు వచ్చి బలూచిస్థాన్ ప్రజలకు పాకిస్థాన్ నుంచి విముక్తి కల్పించాలని కోరారు.