ఇరాన్‌లో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన కమిటీకి మద్దతు ఇచ్చేందుకు ప్రతిపక్ష నేత, మాజీ ప్రధానమంత్రి మీర్ హుస్సేన్ మౌసావి నిరాకరించారు. ఈ నెల 12న జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జరిపే పాక్షిక రీకౌంటింగ్ కోసం గార్డియన్ కౌన్సిల్ ఈ కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది.
అయితే ఈ కమిటీకి మద్దతు ఇచ్చేందుకు మౌసావి నిరాకరించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. తన పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులను మౌసావి ఖండించారు.
ఇరాన్‌లో మళ్లీ అధ్యక్ష ఎన్నికలు జరపాలని మరోసారి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ఆయన దీనికి సంబంధించిన దర్యాప్తును పూర్తిస్థాయిలో జరపడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం బ్యాలెట్లలో పది శాతం బ్యాలెట్లనే తిరిగి లెక్కించే దర్యాప్తు ప్రజావిశ్వాసాన్ని పొందలేమన్నారు.