పాక్, తీవ్రవాదంపై అమెరికాతో భారత్ చర్చలు

పాకిస్థాన్, తీవ్రవాదం అంశాలపై భారత హోం శాఖ మంత్రి పి.చిదంబరం అమెరికా నేతలతో చర్చలు జరిపారు. దక్షిణాసియా ప్రాంతంలో తీవ్రవాద సమస్యను ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని విస్తరించడంపై భారత్- అమెరికా దేశాల నేతలు తాజా చర్చల్లో దృష్టిసారించారు. చిదంబరం బుధవారం ఒబామా అధికారిక యంత్రాంగంలోని ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

ముంబయి ఉగ్రవాద దాడుల సూత్రధారులను చట్టం ముందుకు తీసుకురావడంలో పాక్ ప్రభుత్వ పాత్రపై చిదంబరం, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జనరల్ జేమ్స్ జోన్స్ మధ్య జరిగిన సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి భేటి వైట్‌హోస్‌లో జరిగింది. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన జోన్స్ ఇరుదేశాల మధ్య తీవ్రవాద నిరోధక చర్యలు, కార్యకలాపాల్లో విస్తృత సహకారాన్ని కోరారు.

ఇదిలా ఉంటే తాజాగా చిదంబరం నాలుగు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం హోమ్‌లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ జానెట్ నాపోలిటానో, అమెరికా అటార్నీ జనరల్ ఎరిక్ హెచ్ హోల్డర్ జూనియర్‌లతోనూ సమావేశమయ్యారు. అనంతరం సెనెట్ నిఘా కమిటీ ఛైర్‌వుమన్, సెనెటర్ డయానే ఫెయిన్‌స్టెయిన్‌తోనూ చర్చలు జరిపారు. అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్‌తో గురువారం చిదబంరం భేటీ కానున్నారు.

వెబ్దునియా పై చదవండి