బైతుల్లా యమ డేంజర్: హాల్‌బ్రూక్

తాలిబన్ ప్రముఖుడు బైతుల్లా మెహసూద్‌ను అతి భయంకరమైన వ్యక్తిగా అమెరికా చిత్రీకరించింది.

ప్రముఖ ఉగ్రవాద సంస్థ తహరీక్-ఏ-తాలిబన్‌కు చెందిన ప్రముఖుడు బైతుల్లా మెహసూద్ అతి భయంకరమైన వ్యక్తి అని, పాకిస్థాన్ దేశపు వ్యవహారాలపై ప్రత్యేక దౌత్యాధికారిగానున్న రిచర్డ్ హాల్‌బ్రూక్ అన్నారు. అతనిని అంతమొందించడమే అమెరికా ప్రథమ లక్ష్యంగా ఆయన తెలిపారు.

తొలుత అమెరికా మెహసూద్‌ను పెద్దగా పట్టించుకోలేదని కాని ఇప్పుడు అతనిని అంతమొందించేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ఇది ఓ యుద్ధంలా సాగుతోందని ఆయన తెలిపారు.

పాక్‌లోని స్వాత్ లోయలో ఇప్పటికికూడా పరిస్థితి కుదుట పడలేదని అక్కడ ఉగ్రవాదులు తిష్టవేసి ఉన్నారని, అక్కడున్న ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వం ఇంకా అదుపులోకి తీసుకోలేదని ఆయన అన్నారు.

పాక్ ప్రస్తుతం మెహసూద్‌పై దాడి చేసే విషయంపై దృష్టి సారించేకన్నాకూడా ముందుగా స్వాత్ లోయలోని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తమకు తెలుస్తోందని హాల్‌బ్రూక్ అభిప్రాయపడ్డారు.

స్వాత్ లోయలోని ప్రజలు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకున్నాకే పాక్ ప్రభుత్వం బైతుల్లాపై సైనిక దాడులకు దిగవచ్చని తాము భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇదిలావుండగా ప్రస్తుతం అమెరికా ఆ ప్రాంతంలో గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుని మళ్ళీ ఆ తప్పులు పునరావృత్తం కాకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.

కాగా పాక్‌ ప్రభుత్వానికి తాము తగినంత సాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తమ సాయం వీలైనంత త్వరగా వారికి అందిస్తామని ఆయన అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి