బ్రిటీష్ గ్రంథాలయంలో ఝూన్సీ రాణి దస్తూరీ లేఖ!

బుధవారం, 18 నవంబరు 2009 (09:45 IST)
బ్రిటన్‌లోని ఒక బ్రిటీష్ లైబ్రరీలో ఝాన్సీ రాణీ లక్ష్మీభాయి స్వదస్తూరితో రాసిన లేఖ ఒకటి వెలుగుచూసింది. అప్పటి ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ లాడ్ర్ డల్హౌసీకి ఆమె ఈ లేఖను రాసినట్టు గుర్తించారు. ఆమె భారత్‌ స్వాతంత్య్ర పోరాటం జరిగిన 1857కి ముందు ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. లక్ష్మీభాయి భారత జాతీయత దృక్పథంతో ఈ లేఖ రాశారని విక్టోరియా రాణి రిసెర్చ్‌ క్యూరేటర్‌ దీపికా అహ్లావత్‌ వెల్లడించారు.

ప్రస్తుతం లండన్‌లో జరుగుతున్న ఆల్బర్ట్‌ మ్యూజియం మహారాజా ఎగ్జిబిషన్‌లో ఈ లేఖను ప్రదర్శిస్తున్నట్లు ఆమె తెలిపారు. తన భర్త మరణానంతరం చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను ఆ లేఖలో ఝాన్సీ పేర్కొన్నారని తెలిపారు. రాణి దంపతులకు సంతానం లేకపోవడంతో దామోదర్ రావు అనే బాలుడిని దత్తత తీసుకున్న విషయాన్ని కూడా ఆమె అందులో ప్రస్తావించారు.

తన భర్త మరణానంతరం దత్తపుత్రుడిని ఝాన్సీ సంస్థానానికి వారసుడిగా ప్రకటించాలని ఈస్టిండియా కంపెనీని కోరగా, గవర్నర్ డల్హౌసి అందుకు నిరాకరించి ఝాన్సీ సంస్థానాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వంలో విలీనం చేసినట్టు తెలిపారు. 1857లో జరిగిన తొలి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఝాన్సీ రాణి ఆ యుద్ధంలో వీరమరణం పొందిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి