భారతీయ విద్యార్థుల భద్రతపై రూడ్ హామీ

తమ దేశంలో భారతీయ విద్యార్థుల భద్రత కోసం అన్నిరకాల చర్యలు చేపడతామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కెవిన్ రూడ్ శుక్రవారం హామీ ఇచ్చారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ ఈ రోజు కెవిన్ రూడ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరిగిన వరుస జాతివివక్ష దాడుల అంశం కూడా చర్చకు వచ్చింది.

భారతీయులపై దాడులను అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపడుతుందని రూడ్ భారత విదేశాంగ మంత్రికి హామీ ఇచ్చారు. రూడ్- ఎస్ఎం కృష్ణల మధ్య 20 నిమిషాలపాటు రహస్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారతీయ విద్యార్థులపై జరిగిన జాతివివక్ష దాడులే ప్రధానాంశమైనట్లు తెలుస్తోంది.

భారతీయులపై దాడులను అరికట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల ఎస్ఎం కృష్ణ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా ప్రధాని ఇచ్చిన హామీ సంతృప్తికరంగా ఉందని తాజా సమావేశం అనంతరం కృష్ణ విలేకరులతో చెప్పారు.

ఆస్ట్రేలియాలో భారతీయుల రక్షణకు ఎటువంటి ఇబ్బంది తలెత్తదని, వారికి తమ దేశం సురక్షితమైందని రూడ్ తెలిపారు. తాజా సమావేశంలో దాడులతోపాటు, వాణిజ్యం, ఇతర ద్వైపాక్షిక అంశాలపై కూడా రూడ్, కృష్ణ చర్చలు జరిపారు. యురేనియం ఎగుమతులకు సంబంధించి ఈ సందర్భంగా ఎటువంటి చర్చలు జరగలేదు.

వెబ్దునియా పై చదవండి