భారత్‌పై ఆరోపణలు: నోరుమెదపని పాకిస్థాన్

పాకిస్థాన్‌లో తాము తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆధారాలతో కూడిన నివేదికను ఆ దేశ ప్రభుత్వం తమకు పంపిందనే వార్తలను భారత ప్రభుత్వం గురువారం తోసిపుచ్చింది. పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవల ఈజిప్టులో భారత యంత్రాంగానికి ఈ నివేదికను అందజేసినట్లు డాన్ అనే పత్రిక వెల్లడించింది.

పాకిస్థాన్ మీడియాలో సాక్ష్యాధారాల నివేదికకు సంబంధించి వచ్చిన వార్తలన్నీ అవాస్తవమేనని భారత విదేశాంగ శాఖ సహాయమంత్రి ప్రనీత్ కౌర్ తెలిపారు. పాక్ ప్రభుత్వం తమకు అటువంటి నివేదికేదీ అందజేయలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్ ప్రభుత్వం వారి మీడియాలో వచ్చిన వార్తలపై నోరు మెదపడంలేదు.

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో భారత్ తీవ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్నట్లు, లాహోర్‌లో శ్రీలంక క్రికెట్ జట్టుపై, పోలీసు అకాడమీపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో భారత్ ప్రమేయం ఉందనే ఆరోపణలను బలపరిచే ఆధారాలను ఆ దేశ ప్రభుత్వం ఈజిప్టులో ఇరు దేశాల ప్రధానమంత్రులు భేటీ అయిన సందర్భంగా భారత్‌కు అందజేసినట్లు డాన్ పేర్కొంది.

ఈ వార్తలను భారత ప్రధాన మంత్రి కార్యాలయం కూడా తోసిపుచ్చింది. పాకిస్థాన్ తమకు దీనికి సంబంధించిన నివేదికలేవీ అందజేయలేదని స్పష్టం చేసింది. ఈ వార్తలను పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి అబ్దుల్ బసిత్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన నోరు మెదపలేదు. ఈ వార్తలను వాస్తవమో, అవాస్తమో చెప్పేందుకు ఆయన నిరాకరించారు.

ఈ వివాదంలో నిఘా వ్యవస్థతో ముడిపడిన విషయాలు ఉన్నాయి. వీటిని బహిరంగంగా చర్చించడం సాధ్యపడదన్నారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఈజిప్టు పర్యటనలో జరిగిన చర్చలు, పరస్పరం ఇచ్చిపుచ్చుకున్న నివేదికలు వివరాలన్నీ సంయుక్త ప్రకటనలో పొందుపరిచామన్నారు. సంయుక్త ప్రకటనలోని అంశాలే ఈజిప్టు పర్యటన సమగ్ర సారాంశమన్నారు.

వెబ్దునియా పై చదవండి