తొలిసారి తమ దేశ భద్రతకు భారత్ నుంచి ముప్పు లేదని భావించిన పాకిస్థాన్ తూర్పు సరిహద్దు నుంచి గణనీయమైన స్థాయిలో మిలిటరీ బలగాలతో పాటు ఆస్తులను అల్ ఖైదా, తాలిబాన్ మిలిటెంట్లపై యుద్ధానికి గానూ పశ్చిమ దిక్కుకు తరలించింది. వాషింగ్టన్‌లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో తీవ్రవాదంపై పోరాటంలో తాము చేస్తున్న కృషిని వివిధ దేశాల దౌత్యవేత్తలకు తెలియజేస్తూ పాకిస్థాన్ ఎంబసీ ఈ వివరాలను వెల్లడించింది.
అమెరికాలో పాకిస్థాన్ రాయబారి హుస్సేన్ హక్కానీ, రక్షణ అధికారులు క్లుప్తంగా ఈ వివరాలు ఇవ్వగా పలువురు ఉన్నతస్థాయి పాకిస్థాన్ దౌత్యవేత్తలు తీవ్రవాదంపై పోరాటం చేస్తున్న ఇస్లామాబాద్‌కు అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని కోరారు. కాగా ఈ సమావేశానికి భారత రక్షణ అధికారులకు ఆహ్వానం లభించలేదు. పాకిస్థాన్ 450 ఆర్టిలరీ గన్స్‌తో పాటు 142 ట్యాంక్‌లను పశ్చిమ సరిహద్దుకు తరలించింది. గత ఏడాది వరదల కారణంగా ఈ ప్రాంతం నుంచి బలగాలను తరలించలేదని ఈ సందర్భంగా పాకిస్థాన్ దౌత్యవేత్తలు పేర్కొన్నారు.