ముంబై బాధితుల కోసం అమెరికా నిధులు

ఆదివారం, 1 ఫిబ్రవరి 2009 (11:12 IST)
ముంబై మారణహోమంలో మృత్యువాత పడిన వారికి ఆర్థిక సాయం అందించేందుకు అమెరికాకు చెందిన ఒక ఛారిటీ సంస్థ నిధుల సేకరణకు శ్రీకారం చుట్టింది. `ఛారిటీస్‌ లాడ్జింగ్‌ గ్రూప్‌' న్యూయార్క్‌లో నిర్వహించిన కార్యక్రమం ద్వారా ఒక్కరోజులోనే 51 వేల డాలర్లను (దాదాపుగా రూ.25.50 లక్షలు) విరాళంగా సేకరించింది. ఈ నిధిని ఇప్పటికే భారత్‌లో పనిచేస్తున్న అమెరికన్‌ ఇండియన్‌ ఫౌండేషన్‌కు (ఎఐఎఫ్‌) అందజేయనుంది.

ఈ ఫౌండేషన్‌ ద్వారా తాజ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ వెల్‌ఫేర్‌ ట్రస్ట్, ది ఒబెరాయ్‌ కేర్‌ ఫండ్‌, బాంబే కమ్యూనిటీ ట్రస్ట్‌లతో పాటు భారత్‌లోని ఇతర స్వచ్ఛంద సంస్థలకు చేరనున్న ఈ నిధిని బాధితులకు నేరుగా అందజేయనున్నారు. శాన్‌ఫ్రాన్సిస్‌స్కోకు చెందిన ఛారిటీస్‌ లాడ్జింగ్‌ గ్రూప్‌ అనే ఈ సంస్థ నిధుల సేకరణ కోసం మొత్తం మూడు కార్యక్రమాలను రూపొందించింది.

ఇందులో ఒకటి న్యూయార్క్‌లో నిర్వహించగా, మిగిలినవి రెండూ శాన్‌ఫ్రాన్సిస్‌స్కో, చికాగోల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ముంబై దాడులు కేవలం భారత్‌లో విషాదాన్ని నింపడమే కాదు లక్షలాదిమందికి జీవన ఉపాధిని కల్పిస్తున్న పర్యాటక రంగాన్నీ దెబ్బతీసిందని ఛారిటీస్‌ లాడ్జింగ్‌ అధ్యక్షుడు రాబ్‌ క్లినే అన్నారు.

వెబ్దునియా పై చదవండి