ముషారఫ్‌‍కు భద్రత కల్పించడం లేదు: పాక్

ప్రవాసంలోకి వెళ్లిన పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు పాక్ ప్రభుత్వం అధికారిక భద్రత కల్పినట్లు వచ్చిన వార్తలను పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సీనియర్ నేత ఒకరు తోసిపుచ్చారు. పీపీపీ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం లండన్‌లో ఉంటున్న ముషారఫ్‌కు ఎటువంటి భద్రత కల్పించడం లేదని స్పష్టం చేశారు.

ముషారఫ్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం ఎటువంటి భద్రత కల్పించడం లేదని పీపీపీ నేత ఫౌజియా వాహబ్ బుధవారం వెల్లడించారు. ఇదిలా ఉంటే ముషారఫ్‌కు పాక్ ప్రభుత్వం అధికారిక భద్రత కల్పిస్తుందని బ్రిటన్‌లోని పాకిస్థాన్ దౌత్యకార్యాలయ వర్గాలు చెప్పినట్లుగా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మాజీ అధ్యక్షుడి హోదాలో ఆయనకు పూర్తి భద్రత కల్పిస్తున్నట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి.

లండన్‌లోని ఎడ్‌గ్వారే రోడ్డులో ఉన్న ముషారఫ్ విలాసవంతమైన నివాసానికి 12 మంది పాకిస్థాన్ ఆర్మీ సిబ్బంది రక్షణ కల్పిస్తున్నారని ఓ వార్తా పత్రిక వెల్లడించింది. అయితే ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, పాకిస్థాన్ ప్రభుత్వం మాజీ అధ్యక్షుడి హోదాలో ముషారఫ్‌కు ఎటువంటి భద్రత కల్పించడం లేదని వాహబ్ స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి