లిబియాకు మద్దతు.. నాటోకు క్యూబా-జింబాబ్వే ఖండన!

బుధవారం, 17 ఆగస్టు 2011 (09:10 IST)
లిబియాలో చట్టబద్ధమైన రాజకీయ శక్తిగా టీఎన్‌సీని లిబియా కాంటాక్టు గ్రూపు గుర్తించినప్పటికీ ఈ సామ్రాజ్యవాద యుద్ధానికి వ్యతిరేకంగా లిబియా ప్రజలు సాగిస్తున్న పోరాటానికి మద్దతిస్తున్న సంస్థలు, ప్రభుత్వాల సంఖ్య పెరుగుతోంది. తమను ఒంటరిపాలు చేస్తూ అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు తమపై అక్రమంగా పోరు చేస్తున్నాయంటూ లిబియా అధ్యక్షుడు గడాఫీ ఆరోపిస్తున్నారు.

పైపెచ్చు అనేక దేశాల మద్దతును కూడగట్టేందుకు ఆయన విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా లిబియా ఆర్థిక, ప్రణాళికా మంత్రి అబ్దుల్‌ హఫీద్‌ ఎం జ్లిట్నీని క్యూబాకు పంపుతున్నారు. క్యూబాకు వెళ్లే ఆయన ఆ దేశాధ్యక్షుడు రావుల్‌ కాస్ట్రోతో సమావేశమై గడాఫీ పంపిన సందేశాన్ని అందజేస్తారు.

కాగా, లిబియాపై నాటో సైనిక అణచివేతను ముఖ్యంగా అమాయక ప్రజల మరణాలకు దారితీసే విధంగా పౌర సదుపాయాలపై దాడులు జరపడాన్ని క్యూబా తీవ్రంగా ఖండిస్తున్నట్లు రావుల్‌ వ్యాఖ్యానించినట్టు గ్రాన్మా వార్తా సంస్థ తెలిపింది. అలాగే, తిరుగుబాటు గ్రూపులను లిబియాలో చట్టబద్ధమైన ప్రభుత్వంగా బొలివేరియన్‌ విప్లవం గుర్తించబోదని వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌ ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి