ట్రంప్ చేసిన తప్పు.. అమెరికాపై కిమ్ జాంగ్ ఏ క్షణంలోనైనా అణ్వస్త్ర దాడి చేయొచ్చు: రష్యా జోస్యం

సోమవారం, 10 ఏప్రియల్ 2017 (17:08 IST)
సిరియాలోని షాయ్‌రత్ వైమానిక స్థావరానికి చుట్టుపక్కల 59 క్షిపణులతో షాయ్‌రత్ ఎయిర్‌బేస్‌తో అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో నలుగురు చిన్నారులతో పాటు 9 మంది మృతి చెందారు. సిరియాలో ఐసిస్ టెర్రరిస్టులపై ఆరేళ్ల పాటు అమెరికా, రష్యా వేర్వేరు సంకీర్ణాలుగా పోరాటం చేస్తున్నాయి. గత వారం ఐసిస్ ఆధీనంలోని ఓ పట్టణం జరిగిన రసాయనిక దాడిలో వందమందికి పైగా మరణించారు.
 
ఈ రసాయనిక దాడి అనాగరికమని.. ఇందుకు ప్రతీకారంగా రసాయనిక దాడి జరిగిన రెండు రోజుల్లోనే అమెరికా క్షిపణి దాడి జరిపింది. కానీ తమ ఎయిర్‌బేస్‌పై అమెరికా క్షిపణి దాడి అనాలోచితం, బాధ్యతారాహిత్యమని సిరియా అధ్యక్షుడు అసద్ తీవ్రంగా విమర్శించారు. 
 
ఈ నేపథ్యంలో అమెరికాపై ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఏ క్షణంలోనైనా దాడి చేసే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రష్యా హెచ్చరించింది. దక్షిణకొరియాకు భారీ ఎత్తున ఆయుధాలను, సైన్యాన్ని తరలించడం మంచిది కాదని రష్యా వార్నింగ్ ఇచ్చింది. క్షిపణితో దాడులు చేయడం ద్వారా అమెరికా కిమ్ జాంగ్‌ను రెచ్చగొట్టినట్లవుతుందని రష్యా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఛైర్మన్ విక్టర్ ఓజెరోవ్ పేర్కొన్నారు. 
 
తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం... అమెరికాపై కిమ్ జాంగ్ ఏ క్షణంలోనైనా అణ్వస్త్ర దాడి జరిపే అవకాశం ఉందని ఓజెరోవ్ చెప్పారు. కిమ్ జాంగ్‌ను రెచ్చగొట్టే విధంగా అమెరికా ఎలాంటి ప్రయత్నం చేసినా... ఇరు దేశాల మధ్య భీతావహ వాతావరణం నెలకొంటుందని విక్టర్ హెచ్చరించారు. అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ తప్పు.. కిమ్ జాంగ్‌తో యుద్ధానికి దారితీసిందని విక్టర్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి