భారత్‌లో మూడు దశల్లో లాక్‌డౌన్ అమలు చేయాలి.. అపుడే...

ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (15:53 IST)
కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ లాక్‌డౌన్ గడువు ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. అంటే 15వ తేదీ నుంచి ఎప్పటిలా స్వేచ్ఛా జీవులు కావొచ్చు. అయితే, ఈ లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడగించాలని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 
 
కేంబ్రిడ్జి యూనివర్శిటీకి చెందిన రాజేశ్ సింగ్, ఆర్.అధికారి అనే విద్యావేత్తలు చేసిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు నివేదించారు. భారత్‌లో ఒక లాక్‌డౌన్ సరిపోదని, మూడు దశల లాక్‌డౌన్ విధించాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే కరోనా మహమ్మారిని నియంత్రించడం సాధ్యమవుతుందని చెప్పుకొచ్చాడు. 
 
తొలి దశ విధించిన 21 రోజుల లాక్ డౌన్ పూర్తయ్యాక ఐదు రోజుల విరామం ఇచ్చి రెండో దశలో 28 రోజుల లాక్‌డౌన్ ప్రకటించాలని సూచించారు. మొదటి దశ లాక్ డౌన్ వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిస్తుందని, అయితే కరోనా వ్యాప్తిని వాస్తవిక దృక్పథంతో చూడాలని, మళ్లీ వ్యాపించే అవకాశం ఉన్నందున మరోసారి లాక్‌డౌన్ ప్రకటిస్తే మరికొంత ఉపయోగం ఉంటుందని వివరించారు. 
 
తగ్గిన కేసుల ఆధారంగా వైరస్ పునరుజ్జీవనాన్ని అంచనా వేయలేమన్నారు. రెండో దశ లాక్‌డౌన్  పూర్తయ్యాక మరో 5 రోజుల విరామం ఇచ్చి ఈసారి 18 రోజుల లాక్‌డౌన్ ప్రకటించాలని సూచించారు. మూడో విడత అనంతరం పాజిటివ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా నమోదవుతుందని, మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గుతుందని రాజేశ్ సింగ్, అధికారి తమ అధ్యయనంలో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు