గత యేడాది నవంబరు 26వ తేదీన ముంబైపై జరిగిన దాడులకు సంబంధించి పాకిస్థాన్‌కు భారత్ నాలుగో నివేదికను శనివారం అందజేసింది. మొత్తం ఏడు పేజీలతో కూడిన ఈ నివేదికను న్యూఢిల్లీలోని పాక్ హైకమిషనర్ రిఫాత్ మసూద్‌కు కేంద్ర హోం శాఖ అధికారులు అందజేశారు.
అనంతరం హోం మంత్రి చిదంబరం మాట్లాడుతూ.. ముంబై దాడుల్లో జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ హస్తం ఉన్నట్టు నిరూపించే సాక్ష్యాధారాలను అనేకం ఇప్పటికే పాక్‌కు సమర్పించామని, అందువల్ల అతన్ని అరెస్టు చేసి విచారించాలని డిమాండ్ చేశారు.
కాగా, పాక్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు తెలుపుతూ కేంద్రం నాలుగో నివేదికను రూపొందించింది. ఇందులో ముంబై పోలీసులకు ప్రాణాలతో పట్టుబడిన పాక్ తీవ్రవాది అజ్మల్ కసబ్ వాంగ్మూలంతో పాటు.. ఇతర ఆధారాలను ఇందులో పేర్కొన్నారు.
అంతేకాకుండా, పాక్ కేంద్రంగా పని చేస్తున్న లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థకు పాత్ర ఉన్నట్టు నిరూపించే బలమైన సాక్ష్యాధారాలు ఇందులో ఉన్నట్టు ప్రభుత్వం వర్గాల సమాచారం. ఈ అంశాల ఆధారంగా చేసుకుని హఫీజ్‌పై పాక్ చర్యలు చేపట్టాలని భారత్ గట్టిగా డిమాండే చేస్తోంది.