అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ ఫెడరల్ కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. కొత్త ట్రావెల్ బ్యాన్ బిల్లు కోలుకోలేని గాయం వంటిదని న్యాయమూర్తి వ్యాఖ్యనించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలుత ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై ఆయన విధించిన వీసా నిషేధం విధించారు. దీన్ని అమెరికా న్యాయస్థానాలు కొట్టివేశాయి. దీంతో మళ్లీ సరికొత్తగా వీసా నిషేధాన్ని అమలు చేసేందుకు ఆయన సవరించిన మరో బిల్లును సిద్ధం చేశారు. ఈ సారి ఇరాక్‌ను మినహాయించి మిగతా ఆరు దేశాలను వీసా నిషేధిత జాబితాలో చేర్చారు.
ఈ జాబితాలో ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమన్ దేశాలు ఈ లిస్టులో ఉన్నాయి. సరిగ్గా ట్రావెల్ బ్యాన్ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండగానే.. ఇది చట్టబద్ధంగా లేదంటూ హవాయిలోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి డెర్రిక్ వాట్సన్ నిషేధాన్నినిలిపివేశారు. ఈ నిషేధం అమల్లోకి వస్తే ‘కోలుకోలేని గాయం’ తగులుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు అమల్లోకి వస్తే మత సమానత్వం, స్వేచ్ఛను కాపాడే ‘ఎస్టాబ్లిష్‌మెంట్ క్లాస్’ను ఉల్లఘించినట్టేనని స్పష్టం చేశారు.