ఆన్‌లైన్ దిగ్గజ విక్రయ సంస్థ అమెజాన్ సారీ చెప్పేసింది. అమెజాన్ కెనడా విభాగం భారత జాతీయ జెండాను ముద్రించిన డోర్ మ్యాట్లను అమ్మకానికి పెట్టడంపై భారతీయుల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలకు తలొంచిన అమెజాన్ సంస్థ భారత మనోభావాలను గాయపర్చినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా అభ్యంతరం తెలుపడంతో స్పందించిన అమెజన్ సంస్థ తన కెనడా విభాగం అమ్మకానికి పెట్టిన వివాదాస్పదమైన డోర్ మ్యాట్‌లను వెబ్‌సైట్ నుంచి తొలగించింది.
అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్ కేంద్ర మంత్రికి ఉత్తరం రాస్తూ జరిగిన ఘటనకు చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ పతాకాన్ని ముద్రించిన కాళ్లు తుడుచుకునే మ్యాట్‌లను అమ్మకానకి పెట్టింది అమెజానా కాదని, మూడో పార్టీ విక్రేత ఒకరు ఈ పనిచేశారని అమిత్ ఆ ఉత్తరంలో వివరణ ఇచ్చారు. భారత్‌లో ఈ ఉత్ప్తత్తులు అందుబాటులో లేవు. ఈ విషయం గురించి తెలిసిన వెంటనే మేము కెనడియన్ వెబ్ సైట్ నుంచి వాటిని తొలగించాము. ఏ ఇతర మార్కెట్లలో గానీ, వెబ్ సైట్లలో కానీ ఈ ఉత్పత్తులును అమ్మకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
వివాదాస్పద డోర్ మ్యాట్‌ల అమ్మకాలను నిలిపివేయకపోతే అమెజాన్ అదికారుల వీసాలను రద్దు చేస్తామని, ఇకపై ఏ అమెజాన్ అధికారికీ వీసా మంజూరు చేయమని సుష్మా స్వరాజ్ హెచ్చరించడంతో అమెజాన్ తశ్రణ చర్యలు చేపట్టింది. భారతీయుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశమే తమకు లేదని భారత్‌లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి గత సంవత్సరమే పథకాలు ప్రకటించామని అమిత్ గుర్తు చేశారు. భారతీయ సంప్రదాయాలను తాము గౌరవిస్తామని, జరిగిన ఘటనకు చింతిస్తున్నామని అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు అమిత్ అగర్వాల్ పేర్కొన్నారు.