ఇంటి యజమానిని పోలీసులకు పట్టించిన పెంపుడు శునకం!

శుక్రవారం, 31 అక్టోబరు 2014 (13:28 IST)
అమెరికాలో ఓ డ్రగ్స్ కేసులో ఇంటి యజమానినే పెంపుడు శునకం పోలీసులకు పట్టించింది. దీంతో ఇంటి యజమాని జైలుపాలయ్యాడు. అమెరికాలోని ప్రాట్ విల్లే పోలీసులు ఒక డ్రగ్స్ కేసులో ఎడ్విన్ హెండర్సన్‌ కోసం కొన్ని నెలలుగా గాలిస్తూ వచ్చారు. 
 
అయితే, గురువారం అతను తన నివాసంలోనే ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకున్నారు. పోలీసుల రాకతో హెండర్సన్ ఇంటి నుంచి పారిపోయేందుకు పరుగు లంఘించాడు. అతడి పెంపుడు కుక్క 'బో' ఆ సమయంలో అక్కడే ఉంది. 
 
వెంటనే అప్రమత్తమైన ఓ పోలీసు అధికారి... 'గో... గెట్ హిమ్' అని బిగ్గరగా అరిచాడు. దీంతో 'బో' నేరుగా యజమాని దాగిన గడ్డి దుబ్బుల వద్దకు వెళ్లి ఆగింది. అక్కడ నిలబడి తోక ఊపుతుండటంతో పోలీసు అధికారులకు విషయం అర్థమైంది. వెంటనే హెండర్సన్‌ను బయటకులాగిన పోలీసులు అతనిని అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి