మొన్నటివరకూ హిల్లరీ క్లింటన్ కు ఎదురేలేదని అంతా అనుకున్నారు. కానీ హఠాత్తుగా డొనాల్డ్ ట్రంప్ పదిరోజుల్లో 10 శాతం ఓట్లను కైవసం చేసుకుని హిల్లరీ క్లింటన్ కంటే ఒక్క శాతం అధిక ఓట్లతో షాకిచ్చారు. దీనితో మనదేశంలో స్టాక్ ఎక్సేంజి సైతం నేల చూపులు చూస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, హిల్లరీ భవితవ్యం మరో ఆరు రోజుల్లో తేలిపోనుంది. ఈ నేపధ్యంలో ట్రంప్ ఓట్ల శాతం గణనీయంగా పెరడటం ఉత్కంఠతను రేపుతోంది.
మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు వ్యతిరేకంగా ఓ రిపబ్లికన్ హిందూ సంఘం ప్రచారం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ప్రచారం చాలా సెంటిమెంటుతో కూడుకుని ఉంది. అదేమిటయ్యా అంటే... ప్రస్తుతం పాకిస్తాన్ పేరు చెబితే ఇండియన్ రక్తం ఉడికిపోతుంది. అలాంటి సెంటిమెంటును ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకు ట్రంప్ మద్దతుదారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
హిల్లరీ క్లింటన్ పాకిస్థాన్ సానుభూతిపరురాలని, పాక్‌కు వేల కోట్ల డాలర్ల సాయం చేశారని ఆరోపిస్తున్నారు. భారత్ పైన పోరాడేందుకు ఆమె పాకిస్తాన్‌కు ఎన్నో ఆయుధాలను కూడా సమకూర్చారంటూ పేర్కొన్నారు. అప్పట్లో నరేంద్ర మోదీకి వీసా రాకుండా చేయడంలోనూ హిల్లరీదే కీలక పాత్ర అనీ, అన్నిటికీ మించి హిల్లరీ సహాయకురాలు హ్యూమా అబెదిన్ పాకిస్థాన్ సంతతికి చెందినవారనీ, కాబట్టి హిల్లరీ గెలిస్తే ఆమె చీఫ్ ఆఫ్ స్టాఫ్ అవుతుందనీ, తద్వారా పాకిస్తాన్ దేశానికి అధిక ప్రాధాన్యం దక్కి భారతదేశంపై ఒత్తిడి పెరుగుతుందంటూ రిపబ్లికన్ హిందూ కొలిషన్ ఆరోపించింది.