మాక్ డ్రిల్ సైరన్ అనుకుని ఇళ్లలోనే మెక్సికన్లు... శిథిలాల కింద వందల మంది

బుధవారం, 20 సెప్టెంబరు 2017 (13:22 IST)
మెక్సికో నగరాన్ని భారీ భూకంపం ఓ కుదుపు కుదిపింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. దీంతో మెక్సికో నగరంలోని అనేక బహుళ అంతస్తు భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఆ భవనాల్లోనే ప్రజలు సజీవ సమాధైపోయారు. 
 
భూకంప బాధిత ప్రాంతంలో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భవన శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దీంతో మృతుల సంఖ్య ఇప్పటికే 200 దాటింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు సహాయ బృందాలు పేర్కొంటున్నాయి.
 
అయితే, స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మెక్సికో పట్టణంలో సంభవించిన భూకంపంలో అధిక ప్రాణనష్టం ఏర్పడటానికి ప్రధాన కారణం ఇటీవల నిర్వహించిన మాక్ డ్రిల్స్ అని తెలుస్తోంది. గత 1987 సెప్టెంబర్ 19న భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపం ధాటికి 10 వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దానిని పురస్కరించుకుని మెక్సికోలోని ప్రధాన పట్టణాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. 
 
భూకంప సమయాల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలు, భూకంప ప్రభావం బారిన పడకుండా ఉండాలంటే చేయాల్సిన పనులను గుర్తు చేస్తూ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సైరన్లు మోగించారు. వీధుల్లోకి సిబ్బంది, వాలంటీర్లు వచ్చి, జాగ్రత్తలు చెప్పారు. వాటిని చూసిన ప్రజలు గతం ఆలోచనల్లోంచి పూర్తిగా బయటకు రాలేదు.
 
ఇంతలోనే మెక్సికో నగరంలో మరోమారు భూకంపాన్ని సూచిస్తూ, హెచ్చరికగా సైరన్లు మోగాయి. వాటిని మాక్ డ్రిల్ సైరన్లుగా భావించిన ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. కానీ, భూకంపం తీవ్రత అధికంగా ఉండటంతో భవనాలు కుప్పకూలిపోయాయి. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు అప్రమత్తమయ్యేలోపు భవనాలు వారి మీద కూలిపోయాయి. దీంతో వారు ప్రాణాలు మృత్యువాతపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి