మతిమరుపు రోగులకు ఓ గ్రామం...

సోమవారం, 24 జులై 2017 (09:32 IST)
మతిమరుపు(డెమెన్షియా) రోగుల కోసం ఓ గ్రామం నిర్మితమవుతోంది. ఇందుకోసం సుమారు రూ.128 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ నిధులతో సకల సదుపాయాలను కల్పించనుంది. ఈ తరహా గ్రామాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్న దేశం ఆస్ట్రేలియా. ఈ డెమెన్షియా విలేజ్‌లో 90 ఇళ్లు నిర్మించనున్నారు. అలాగే 18 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. 
 
దక్షిణ టాస్మేనియాలోని హోల్‌బాట్‌లో నిర్మించనున్న ‘డెమెన్షియా విలేజ్’లో 15 దర్జీ ఇళ్లతోపాటు సూపర్ మార్కెట్, సినిమా, కేఫ్, బ్యూటీ సెలూన్, గార్డెన్ తదితరాలు కూడా ఉంటాయి. మతిమరుపు రోగులు పూర్తి స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామాన్ని నిర్మిస్తున్నారు. గ్రామంలో నివసించే వారు సామాజిక కార్యక్రమాలు సహా అన్నింటిలోనూ పాల్గొనేలా దీనిని తీర్చిదిద్దనున్నారు.
 
కాగా, నెదర్లాండ్స్‌లో ఇప్పటికే ఇటువంటి గ్రామం ఒకటి ఉంది. 2009లో డి హోగెవెక్‌లో మతిమరుపు రోగుల కోసం ప్రత్యేకంగా ఓ గ్రామాన్ని నిర్మించింది. ఎనిమిదేళ్లుగా ఇక్కడ నివసిస్తున్న రోగుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఇటువంటి గ్రామమే ఐర్లాండ్‌లో నిర్మితమవుతోంది. ఇక్కడ కూడా కేఫ్, బ్యూటీ సెలూన్, జిమ్, గార్డెన్లు తదితర వాటిని నిర్మిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి