పైసా ఖర్చు లేకుండా లగ్జరీ జీవితాన్ని అనుభవించిన ఆస్ట్రేలియా టీచర్

మంగళవారం, 20 ఆగస్టు 2019 (19:54 IST)
ఆస్ట్రేలియాకు చెందిన ఓ టీచర్ దాదాపు ఏడాదిపాటు ఇల్లు లేకుండా దర్జాగా గడిపేసింది. ఏడాదిపాటు ఎటువంటి డబ్బు ఖర్చు చేయకుండా లగ్జరీ జీవితాన్ని గడపడం అసాధ్యమని కొట్టిపారేసినా ఇది నిజం. దీని కోసం ఆమె 70 డాలర్లు (దాదాపు రూ.5 వేలు) ఖర్చు పెట్టింది. వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాకు చెందిన 22 ఏళ్ల ఎలెని అనే టీచర్ ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో నివసిస్తోంది. 
 
ఆన్‌లైన్‌లో హ్యాపీ హౌస్ సిట్టర్స్, ద హౌస్ సిట్టర్స్ అనే రెండు వెబ్‌సైట్‌లు చూసిన ఆమె.. వాటిలో జాయిన్ అయింది. వీటిలో చేరడానికి ఆమెకు కేవలం రూ.5 వేలు ఖర్చయ్యాయి. అంతే ఆ తర్వాత సెల్ఫీ దిగి, తన ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత ఊళ్లకు వెళ్లే బడా బడా ఇంటి యజమానులు.. తమ ఇల్లు చూసుకోవాలంటూ ఆమెకు మెయిల్స్ పంపారు.
 
వాటిని ఎంచుకొని యజమానులు లేని సమయంలో వారి ఖరీదైన ఇళ్లలో దర్జాగా గడిపేసింది ఎలెని. ఈ ఉద్యోగాలు సాధారణంగా రెండు వారాల నుంచి  రెండు నెలల వరకూ ఉంటాయని ఆమె చెప్పింది. ఓసారి ఒక అందమైన బీచ్ హౌస్‌లో రెండు నెలలు గడపాల్సి వచ్చిందని, తన కోసం ఆ ఇంటి యజమాని పెద్దమొత్తంలో రెడ్‌వైన్ సిద్ధం చేశాడని గుర్తుచేసుకుంది. 
 
అంతేగాక పని పూర్తయ్యాక 500 డాలర్ల (రూ.35వేలపైగా) చెక్కు అందుకున్నట్లు తెలిపింది. సాధారణంగా ఇలా హౌస్ సిట్టర్స్‌ను ఎంచుకునే యజమానులు ఇంట్లో ఫ్రిజ్‌ను పూర్తిగా నింపేస్తారని, ఆహారానికి ఇతర అవసరాలకు అస్సలు కొరత ఉండదని చెప్పిన ఆమె.. జీవితాన్ని పైసా ఖర్చు లేకుండా దర్జాగా గడపడానికి ఇదో చక్కని మార్గమంటూ ఓ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు