ఆడ సింహానికి తోడు కల్పించి... సింహాలకు పసందైన విందు ఇచ్చారు... ఎక్కడ?

శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (13:32 IST)
'వివాహ భోజనంబు వింతైన వంటకంబు.. వియ్యాలవారి విందు ఓ హో హో'.. అచ్చం ఇలాంటి విందును బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జంతుప్రదర్శనశాలలో సింహాలకు ఏర్పాటు చేసి పర్యాటకులను అబ్బురిచారు జూ అధికారులు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జూపార్కులో నోవా అనే ఆడ సింహం 11 ఏళ్లుగా ఒంటరిగానే జీవిస్తూ పర్యాటకులను కనువిందు చేస్తోంది. ఆడసింహం ఒంటరితనాన్ని చూడలేక అధికారులు దక్షిణ బంగ్లాదేశ్ ప్రాంతంలోని రంగాపూర్ జూ నుంచి నభా పేరుతో ఉన్న మరో మగ సింహాన్ని చిట్టగాంగ్ జూకు అధికారులు రప్పించారు. దీనికి బాద్షా అనే పేరు పెట్టారు. కొత్తగా సింహం వచ్చిన వేళ... ఇద్దరికి పెళ్లి జరుగనున్న వేళ జూ అధికారులు ఆ బోనును పెళ్లి మండపంలా అలంకరించారు. 
 
రంగురంగుల కాగితాలు, బెలూన్ల‌తో సింహాల ఎన్‌క్లోజర్‌ను ముస్తాబు చేసి 400 మంది అతిధుల మధ్య సింహాల వివాహ విందును ఘనంగా ఏర్పాటుచేశారు. ఆ రెండు సింహాలు విందు ఆరగించడం కోసం పదికిలోల కేక్‌ను తయారు చేసి పెట్టారు. గొడ్డుమాంసంతోపాటు చికెన్, గుడ్లు, వేయించిన కాలేయం కలిపి ప్రేమ చిహ్నం లవ్ ఆకారంలో చేసిన కేక్‌ను పెట్టడంతో ఆ నూతన వధూవరులైన సింహాలు సంతోషంతో విందును ఆరగించాయి. 
 
అంతేకాదు సింహాల వివాహానికి ముందు పాఠశాల విద్యార్థులకు సైతం చిన్న విందు ఏర్పాటు చేశామని జూపార్కు అధికారులు మెస్బిహ్ వుద్దీన్, మంజూర్‌లు వెల్లడించారు. అంతేకాదు కొత్తగా పెళ్లైన ఈ జంట ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకోవడానికి మూడు రోజుల పాటు పక్కపక్కన ఏర్పాటు చేసిన బోన్లలో ఉంచినట్లు జూ క్యూరేటర్ మోర్షాద్ వివరించారు. 

వెబ్దునియా పై చదవండి