ఇరాక్ దళాల దాడి.. 74మంది ఐసిస్ జీహాదీల మృతి.. ఆపరేషన్ ఓవర్..
సోమవారం, 24 అక్టోబరు 2016 (16:27 IST)
ప్రపంచ దేశాలను వణికించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు భరతం పట్టేందుకు ఇరాక్ దళాలు నడుంబిగించాయి. ఈ క్రమంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను కిర్కుక్ నగరం నుంచి తరిమికొట్టేందుకు ఇరాక్ దళాలు చేపట్టిన ఆపరేషన్ సోమవారంతో ముగిసింది.
దళాల దాటికి తట్టుకోలేని ఉగ్రవాదులు కొందరు పారిపోగా, మరికొందరు ఆర్మీకి ఎదురొడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు తమను తామే పేల్చేసుకున్నారు. ఇరాక్ దళాల దాడిలో మొత్తం 74 మంది జిహాదీలు మృతి చెందినట్లు గవర్నర్ ప్రకటించారు.
ఇంకా ఐసిస్‌పై దాడులు ముగిశాయి. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుందని కిర్కుక్ ప్రావిన్స్ గవర్నర్ నజ్మెద్దీన్ కరీమ్ వెల్లడించారు. ఇరాకీ దళాలు మొత్తం 74 మంది ఐసిస్ ఉగ్రవాదులను మట్టబెట్టగా ఐసిస్ చీఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు కరీమ్ పేర్కొన్నారు.
అలాగే ఐసిస్ టెర్రరిస్టులకు గట్టి పట్టున్న ప్రాంతాల్లోనూ టెర్రరిస్టుల భరతం పట్టేందుకు ఇరాక్ సంయుక్త దళాలు పోరాడుతాయని సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు.