కామెరూన్ ఉప ప్రధాని భార్యను కిడ్నాప్ చేసిన తీవ్రవాదులు!

సోమవారం, 28 జులై 2014 (15:06 IST)
నైజీరియా, కామెరూన్ ప్రాంతాల్లో బోకో హరామ్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఈ తీవ్రవాదుల సొంత దేశమైన నైజీరియాలో మాత్రమే కాకుండా, పొరుగున ఉన్న కామెరూన్ దేశంలో కూడా వీరి ఆగడాలు శృతిమించి పోతున్నాయి. తాజాగా, నైజీరియా సరిహద్దు దాటి వచ్చి మరీ కామెరూన్‌లోని కోలోఫాటా నగరంపై దాడి చేశారు. చేయడమే కాదు ఏకంగా ఆ దేశ ఉప ప్రధాని అమదౌ అలీ భార్యను, నగర మేయర్‌ను, మరి కొంత మందిని అపహరించుకుపోయారు. ఉగ్రవాదులు తమ దేశంలోని తమ రహస్య స్థావరాలకు వీరిని తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది.
 
కామెరూన్ ప్రస్తుతం తన సైన్యాలను సరిహద్దు వెంబడి మొహరించింది. ఇప్పటికే నైజీరియాకు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు పొరుగు దేశాల్లో బీభత్సాన్ని సృష్టిస్తున్న విషయం తెల్సిందే. బోకో హరామ్ ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది. దీనికి అల్‌ఖైదాతో సంబంధాలున్నాయి. పాశ్చత్య విద్యా విధానానికి వ్యతిరేకంగా కూడా బోకో హరామ్ పోరాడుతోంది. ఇప్పటికే నైజీరియాలోని 200 మందికి పైగా విద్యార్థినులను బోకో హరాం ఉగ్రవాదులు అపహరించుకుపోయి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. వీరిని ఇప్పటి వరకు విడుదల చేయలేదు. 

వెబ్దునియా పై చదవండి