బ్రెజిల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో ఆ దేశ త్రివిధ దళాధిపతులు తమతమ పదవులకు రాజీనామా చేశారు. కోవిడ్ నియంత్రణలో అధ్యక్షుడు బొల్సనారో విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రిని మార్చాలనుకున్నారు. ఆ క్రమంలోనే త్రివిధ దళాధిపతులు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు.
అయితే, తమ రాజీనామాలకు వారు ఎలాంటి కారణాలు వెల్లడించలేదు. రాజీనామా చేసిన వారి స్థానంలో కొత్తగా ఎవర్ని నియమిస్తారో ఇంకా వెల్లడించలేదు. సైన్యంపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించేందుకు బొల్సనారో ఈ మార్పులు చేస్తున్నట్లు విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్ల క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బొల్సనారో .. కోవిడ్ వేళ క్వారెంటైన్ ఆంక్షలను వ్యతిరేకించారు. కోవిడ్ ఆంక్షల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆరోపించారు. కరోనా గురించి ఆలోచించ వద్దు అంటూ ప్రజలను కోరారు కూడా. ముఖానికి మాస్క్ ధరించనక్కర్లేదని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఆయన కరోనా వైరస్ బారినపడి.. మృత్యువు అంచులకు వెళ్లి వచ్చారు. అప్పటికిగానీ ఆయనకు జ్ఞానోదయం కాలేదు. కరోనా ఆంక్షలతోపాటు.. మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనంటూ సెలవిచ్చారు.
ఈ క్రమంలో విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులు సోమవారం రాజీనామా చేశారు. దీంతో క్యాబినెట్‌ను మార్చాలని బొల్సనారో నిర్ణయించారు. అధ్యక్షుడి వ్యవహారశైలితో వ్యతిరేకించిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాధిపతులు.. ఒకేసారిగా రాజీనామా చేయడం బ్రెజిల్ చరిత్రలో ఇదే మొదటిసారి. జనరల్ ఎడ్సన్ లీల్ పుజోల్, అడ్మిరల్ ఇల్‌క్వెస్ బార్బోసా, లెఫ్టినెంట్ బ్రిగేడియర్ ఆంటోనియో కార్లోస్ బెర్ముడేజ్‌లు మంగళవారం ఒకేసారి రాజీనామా చేశారు. అంతకముందు విదేశాంగ మంత్రి ఆరుజో రాజీనామా చేశారు.