కన్నబిడ్డకు కన్యత్వ పరీక్షలు చేయించి... విటులకు అమ్మేసిన తల్లి

మంగళవారం, 25 జులై 2017 (13:01 IST)
రకరకాల కారణాలతో కన్నబిడ్డలను అమ్మేసుకునే తల్లిదండ్రుల కథలు చాలానే విని ఉంటాం. అధిక సంతానమో, దుర్వ్యసనాల బారిన పడి డబ్బుల కోసమో పిల్లలను అమ్ముకోవడం దాదాపు అన్ని ప్రాంతాల్లో, దేశాల్లో జరుగుతూనే ఉంటుంది. కానీ కన్యత్వ పరీక్షలు జరిపి, తన బిడ్డ కన్య అని పరీక్షింపజేసి, వైద్యుని వద్ద నుండి సర్టిఫికేట్ తీసుకుని మరీ పిల్లలను అమ్ముకునే తల్లులూ ఉన్నారు.
 
కాంబోడియాలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన సెఫాక్ అనే అమ్మాయి వయస్సు కేవలం 13 సంవత్సరాలు. హాస్పిటల్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయించిన ఆమె తల్లి, ఆ తర్వాత ఓ సర్టిఫికేట్ అందుకుని, అటు నుండి అటే ఓ హోటల్ రూమ్‌లో విటులకు సెఫాక్‌ను అప్పగించి వెళ్లిపోయింది. మూడు రోజులపాటు నరకయాతన అనుభవించిన అనంతరం జీవచ్ఛవంలా ఇంటికి తిరిగొచ్చింది సెఫాక్. 
 
పిల్లలతో సెక్స్ చేయడానికి ఎంత డబ్బులైనా కుమ్మరించడం అక్కడి విటులకు సరదా. సుమారు 6 వేల డాలర్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన సెఫాక్ తల్లి మరో గత్యంతరం లేక ఈ పనికి పూనుకున్నా, తర్వాత కూడా ఆ అమ్మాయిని వ్యభిచారం చేయమని ఒత్తిడి తేవడంతో సెఫాక్ అనేక సంవత్సరాలపాటు నరకకూపంలోనే ఉండిపోయింది. 
 
ఇటీవలే ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో అక్కడి నుండి బయటపడిన సెఫాక్ ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతోంది. ఒకప్పుడు కాంబోడియాలోని స్వే పాక్ అనే ఆ ఊళ్లో ఆడబిడ్డ పుడితే నూటికి నూరు శాతం వ్యభిచార గృహాలకు అమ్మేసేవారని, ఇప్పుడు అది 50 శాతానికి తగ్గిందని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి