అమెరికా ధీటుగా అతిపెద్ద బాంబును పరీక్షించిన చైనా

శనివారం, 5 జనవరి 2019 (12:55 IST)
అగ్రరాజ్యం అమెరికాకు ధీటుగా చైనా అతిపెద్ద బాంబును పరీక్షించింది. ఇది ఇప్పటికే అమెరికా తయారు చేసిన మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ కంటే శక్తిమంతమైనది కావడం గమనార్హం. ఈ బాంబు అణుబాంబుల తర్వాత అంతటి ప్రభావాన్ని చూపుతుందట. పైగా, చైనా వద్ద ఉన్న అతిపెద్ద బాంబు ఇదే కావడంగమనార్హం. ఈ విధ్వంసక బాంబును డ్రాగన్ కంట్రీ పరీక్షించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
ఈ భారీ బాంబును ప్రయోగిస్తోన్న వీడియోను చైనా ఆయుధ తయారీ సంస్థ నొరిన్ కో విడుదల చేసింది. కొన్ని నిమిషాల వ్యవధిలో సర్వం నాశనం చేయగల సామర్థ్యం ఈ బాంబ్ ప్రత్యేకతగా చెబుతున్నారు. చైనా రూపొందించిన ఈ బాంబును హెచ్-6కె విమానం నుంచి నేల మీదకు జారవిడిచారు. ఈ బాంబు నేలను తాకుతూనే పెను విధ్వంసం సృష్టించింది. అయితే ఈ బాంబును ఎప్పుడు, ఎక్కడ ప్రయోగించారనే విషయం మాత్రం తెలియరాలేదు.
 
కాగా, 2017లో అప్ఘాన్ గుహల్లో దాక్కొని ఉన్న ఐసిస్ ఉగ్రవాదులు లక్ష్యంగా అమెరికా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌ను ప్రయోగించింది. ఇది 9 టన్నుల బరువును కలిగివుంటుంది. తాజాగా చైనా రూపకల్పన చేసిన బాంబు బరువు దానికంటే తక్కువ. బాంబు 5-6 మీటర్ల పొడవు ఉంటుంది. 
 
చైనా కూడా అదే మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌ను పేరును తన బాంబుకు వాడుకుంటోంది. అయితే అమెరికా తయారు చేసిన బాంబు చైనా బాంబు కంటే పెద్దది కావడంతో దానిని తరలించడానికి భారీ రవాణా విమానాలే తప్పమరో మార్గం లేదు. హెచ్-6కె జెట్‌ విమానాలు మాత్రమే దీనిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించగలుగుతాయి.
 
మరోవైపు అమెరికా దాడులకు పాల్పడితే ధీటుగా తిప్పికొట్టేందుకు రష్యా కూడా మరో భారీ బాంబును తయారు చేసింది. దీనిని అది ఫాదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌ అని పిలుచుకుంటోంది. ఇది చైనా, అమెరికా బాంబుల కంటే ఇంకా పెద్దగా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు