ముఖ్యంగా, క్రిస్మస్ పండుగ రోజుల్లో అమెరికాలో ఇలాంటి పరిస్థితి ఏర్పడడంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ షట్‌డౌన్ వల్ల 8 లక్షల మంది అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమందికి వేతనాలు లభించవు. మరికొందరు జీతం లేకుండానే పనిచేయాల్సి పరిస్థితి ఏర్పడింది.
ట్రంప్ ప్రవేశపెట్టిన ఫెడరల్ వ్యయ బిల్లును అమెరికా కాంగ్రెస్ ఆమోదించకుండానే వాయిదావేసింది. ఫలితంగా డిసెంబర్ 21వ తేదీ శుక్రవారం అర్థరాత్రి నుంచి పలు కీలక సంస్థల కార్యాకలాపాలు స్తంభించిపోయాయి. మెక్సికో సరిహద్దులో భారీ గోడ నిర్మిస్తానని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీనివ్వడం... దానికి అవసరమైన నిధులు కేటాయించాలంటూ (రూ.35వేల కోట్లు) కాంగ్రెస్‌ను ట్రంప్ కోరగా, ఈ నిధులు మంజూరు చేసేందుకు అమెరికా కాంగ్రెస్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
ప్రభుత్వం కార్యకలాపాలు స్తంభించడంతో దాదాపు 8 లక్షల ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. వారిలో 4 లక్షల మంది ఉద్యోగులు వేతనాలు తీసుకోకుండా పనిచేయాల్సి వస్తే మరో 4 లక్షల మంది సెలవుపై వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల డాలర్ విలువ పడిపోయే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో నెలకొన్న ప్రభావం భారతదేశంపై ఉంటుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.